అమరావతి రాజధాని విషయంలో మూడేళ్లుగా జరుగుతున్న డ్రామా అంతా తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో అధికార వికేంద్రీకరణ చేపడుతున్నామని.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా వైకాపా ముఖ్య నేతలందరూ చెబుతున్నారు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తామని.. అక్కడి నుంచి రాజధాని ఎక్కడికీ పోదని.. కర్నూలుకు న్యాయ రాజధానిని కేటాయిస్తామని.. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఉంటుందని చెబుతున్నారు.
అమరావతిని ఎందుకు నాశనం చేస్తున్నారని ఎవ్వరడిగినా అది మూడు రాజధానుల్లో ఒకటిగా ఉంటుంది కదా.. దానికేమి అన్యాయం జరగట్లేదనే అంటున్నారు. కానీ అమరావతి అన్నది పేరుకే ఒక రాజధాని అని.. విశాఖపట్నంనే అసలైన రాజధానిగా మార్చాలన్నది వైకాపా అసలు వ్యూహం అన్నది అందరికీ తెలుసు. కర్నూలును న్యాయ రాజధానిగా పెట్టడం రాయలసీమ వాసులను మభ్యపెట్టడానికి చేస్తున్న కంటితుడుపు చర్చ అన్నది కూడా స్పష్టం. కానీ ఈ విషయాలను పైకి వైకాపా నేతలెవవ్వరూ ఇప్పటిదాకా మాట్లాడలేదు.
కానీ శ్రీకాకుళం సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు.. విశాఖ వాసుల్లో ఎమోషన్ పెంచే క్రమంలో తాజాగా నోరు జారేశారు. వైకాపా ఆడుతున్న డ్రామాను బయటపెట్టేశారు. రాజ్యాంగంలో కానీ, దేశంలో కానీ ఎక్కడా మూడు రాజధానులు అనేది లేదని.. అది పేరుకు మాత్రమే అని.. రేప్పొద్దున పరిపాలన అంతా విశాఖపట్నం నుంచే జరుగుతుందని.. అదే అసలైన రాజధాని అని వికేంద్రీకరణ మీద విశాఖలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ధర్మాన స్పష్టంగా చెప్పేశారు.
అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు జరిగినపుడు అందరూ అక్కడికి వెళ్తారని.. కర్నూలులో కోర్టు ఉంటుందని.. అంతకుమించి అక్కడేమీ ఉండదు అనే రకంగా మాట్లాడిన ఆయన.. విశాఖలో మొత్తం పరిపాలన అంతా కేంద్రీకృతం అవుతుందని.. ఇలాంటి అరుదైన అవకాశాన్ని మనం వదులుకోకూడదని జనాలకు పిలుపునివ్వడం గమనార్హం. ఈ వీడియోను సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు వైరల్ చేస్తూ వైసీపీ ఆడుతున్న డ్రామా ఇదంటూ ఆ పార్టీ అసలు స్వరూపాన్ని నెటిజన్లకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.