ఔను! తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారానికి దారితీస్తోంది. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశించి మంత్రి అంబటి తీవ్రమైన వ్యాఖ్య చేశారు. ఇది ఆయన స్థాయికి అంటే.. మంత్రిగా తగని వ్యాఖ్య. ఏ గల్లీ నాయకుడో లేక పోతే మంత్రి పదవిలో లేని నాయకుడో చేస్తే.. వేరేగా ఉండేది. కానీ, ఆయనే నోరు పారేసుకున్నారు. బానిససేన అధ్యక్షుడు .. మళ్లీ వచ్చాడండి రాష్ట్రానికి అని ట్వీట్ చేశారు. దీనిపై అప్పుడే జనసేన నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. తాజాగా ఏపీలో జనసేన అధినేత పవన్ రెండు రోజుల పార్టీ సమావేశం పెట్టుకున్నారు.
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతోంది. దీనికి జనసేన అధినేత పవన్ వచ్చారు. దీనిని ఉద్దేశించి అంబటి చేసిన వ్యాఖ్య దుమారంగా మారింది. అంబటివ్యాఖ్యలకు కౌంటర్‌గా జనసేన నేతలు.. ఎవరు ఎవరికి బానిసలు అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని, పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మీరు కేంద్రానికి బానిసలుగా మారలేదా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు.. జగన్ మెప్పుకోసం, మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం.. మీరు జగన్ ముందు బానిసలు మోకరిల్లడం లేదా? అని నిలదీస్తున్నారు. ఇప్పటికే వైసీపీ, జనసేనల మధ్యతీవ్ర వివాదాలు కొనసాగుతున్నాయి. విశాఖలో జనసేన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకుని, ఆ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని నాయకులు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర రాజకీయాలను అంతో ఇంతో దారికి తెచ్చే బాధ్యత మంత్రులపైనే ఉంది.
సంయమనం పాటిస్తూ.. ఉండాల్సింది పదవుల్లో ఉన్న మంత్రులదే. అయితే.. దీనిని వదిలేసి ఒకటని.. నాలుగు అనిపించుకునేలా వ్యవహరిస్తూ.. రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు ఆజ్యం పోస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. మరి ఇప్పటికైనా మంత్రులు మారతారో లేదో చూడాలి. చేసేందుకు చాలానే పని ఉంది. రాష్ట్రంలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు సిద్ధంగానే ఉన్నారు. వాటిని వినే ఓపిక తీరిక లేని మంత్రులు ఇలా రాజకీయాలురెచ్చగొట్టేలా చేయడం సమంజసమేనా? అన్నది ప్రశ్న.
Gulte Telugu Telugu Political and Movie News Updates