అప్పట్లో అంటే గత ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి, అధికారంలో ఉన్న టీడీపీకి ముందు జోరు యుద్ధం సాగింది. నువ్వా-నేనా అనే రేంజ్‌లో రాజకీయాలు సాగాయి. ఈ క్రమంలోనే 2019లో విజయం దక్కించుకునేందుకు టీడీపీ ఎన్టీఆర్ బయోపిక్‌ను సినిమాగా తీసుకువచ్చిందనే ప్రచారం ఉంది. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్టీఆర్ స్థానంలో ఉండి.. ఆయన పాత్రను పోషించారు. ఈ క్రమంతో ఎన్టీఆర్ సినిమా తెరమీదికి వచ్చింది. ఇక, దీనికి పోటీగా..రాంగోపాల్ వర్మ కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమాను అప్పుడు తెరమీదకి ఎక్కించాడు.
అయితే.. అప్పట్లో వర్మ వెనుక ఎవరు ఉన్నారనేది తెలియదు. కానీ, ఆయన మాత్రం టీడీపీలో జరిగిన 1995 ఎపిసోడ్ కేంద్రంగా సినిమా తీశారు. ఇక అదేసమయంలో వైసీపీ కి చెందిన ఒక నాయకుడు నేతృత్వంలో వైఎస్ పాదయాత్ర నేపథ్యంగా ఒక సినిమాను తీసుకువచ్చారు. ఈ సినిమాలో మలయాళ నటుడు మమ్ముట్టి నటించారు. వైఎస్‌గా ఆయన చేసిన నటన అదరహో అనిపించింది. ఇలా.. టీడీపీ, వైసీపీలు పోటాపోటీ సినిమాలు తీసి ఎన్నికలకు ముందు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
అయితే.. ఇప్పుడు రాజకీయాలు మారాయి. వైసీపీకి పోటీగా.. జనసేన రంగంలోకి దిగింది. టీడీపీ స్థాయిలో ఎమ్మెల్యేలు లేకపోయినా..వైసీపీకి ప్రత్యా మ్నాయం మేమే అన్నట్టుగా జనసేన చక్రం తిప్పుతోంది. ఈ క్రమంలోనే సవాళ్లు ప్రతిసవాళ్లు సైతం రువ్వుతోంది. ఇప్పుడు ఏకంగా సినిమాల వరకు కూడా వచ్చింది. తాజాగా వర్మ.. సీఎం జగన్ తో భేటీ అయినతర్వాత..తాను వ్యూహం, శపథం అనే సీక్వెల్ సినిమాలు చేయాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. ఈ రెండు కూడా రాజకీయ అరాచకాలకు ప్రతిబింబంగా ఉంటాయని కూడా పేర్కొన్నాడు.
ఇక, ఈ ప్రకటన వచ్చిన వెంటనే టీడీపీ రియాక్ట్ అవుతుందని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా జనసేన రియాక్ట్ అయింది. తాము కూడా త్వరలోనే ‘ప్రతివ్యూహం’ అనే మూవీని తీయనున్నట్టు తెలిపింది. అది కూడా.. వర్మ వ్యూహం మూవీని విడుదల చేసే రోజే విడుదల చేయనున్నట్టు నూతన్ నాయుడు అనే వ్యక్తి సంచలన ప్రకటన చేశారు. ఇది వైసీపీ ప్రభుత్వ అరాచకాలను కళ్లకు కడుతుందని తెలిపారు. దీంతో వచ్చే ఎన్నికలకు ముందు వైసీపీ-జనసేన పోటా పోటీ సినిమాలు తీయడం ఖాయమైపోయినట్టేననే చర్చ సాగుతుండడం గమనార్హం.