ఫామ్‌హౌజ్ కేసులో హైకోర్టు తీర్పు ఇదే!

ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఫామ్‌హౌజ్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. నిందితులను రిమాండ్ కు త‌ర‌లించాల‌ని ఆదేశించింది. అంతేకాదు, ఈ కేసులో అవినీతి నిరోధ‌క శాఖ కోర్టు రిమాండ్‌కు పంప‌డాన్ని తిర‌స్క‌రిస్తూ ఇచ్చిన తీర్పును హైకోర్టు స‌స్పెండ్ చేసింది. వాస్త‌వానికి ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని సైబరాబాద్‌ పోలీసులు హైకోర్టులో సవాల్‌ చేస్తూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ధర్మాసనంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. తొలుత దీనిపై నిందితులు హైద‌రాబాద్ విడిచి వెళ్ల‌రాద‌ని.. అడ్ర‌స్ వివ‌రాల‌ను పోలీసుల‌కు ఇవ్వాల‌ని మాత్ర‌మే హైకోర్టు ఆదేశించింది.

తాజాగా శ‌నివారం కోర్టు ప్రారంభం కాగానే ఈ కేసులో తీర్పు ఇస్తూ.. ఎమ్మెల్యేలకు కోట్లు ఇవ్వ‌జూపిన‌ నిందితులను రిమాండ్‌కు అనుమతినిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. నిందితులైన రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ, కోరె నందు కుమార్‌ అలియాస్‌ నందు, డీపీఎస్‌కేవీఎన్‌ సింహయాజిలను.. సైబరాబాద్‌ సీపీ ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం వారిని అరెస్టు చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచాలని ధర్మాసనం పేర్కొంది. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించాలని వెల్లడించింది. దీంతో వారిని మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మయంలో ఏసీబీ కోర్టులో పోలీసులు హాజ‌రుప‌ర‌చ‌నున్నారు.

ఆద్యంతం ఉత్కంఠ‌

ఈ కేసులో ఆది నుంచి కూడా అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. రాజ‌కీయంగా కూడా పెనుదుమారం రేగింది. బీజేపీ ఉద్దేశ పూర్వ‌కంగా త‌మ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయాల‌ని భావించింద‌ని, బీజేపీ వ్య‌వ‌హార‌మే ఇంత‌ని టీఆర్ ఎస్ నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు రాగా, అస‌లు మాకు ఆ ఖ‌ర్మే ప‌ట్ట‌లేద‌ని బీజేపీ నేత‌లు వాదించారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ నేరుగా యాదాద్రికి వెళ్లి త‌డిబ‌ట్ట‌ల‌తో ప్ర‌మాణం కూడా చేశారు. ఇక‌, ఈ విష‌యం ఇలా ఉంటే.. మ‌రోవైపు ఆడియో టేపులు లీకై మ‌రింత ర‌చ్చ‌కు దారితీసింది. మొత్తంగా చూస్తే ఈ ప‌రిణామాలు ఎటు దారితీస్తాయో చూడాల‌ని అంటున్నారు పరిశీల‌కులు.