ఏపీలో మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. బీజేపీతో పవన్ కు చెడిందని, అందుకే, బీజేపీ చేపట్టిన కార్యక్రమాలలో పవన్ కనిపించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చిన పవన్…బీజేపీతో వ్యవహారంపై కూడా షాకింగ్ కామెంట్లు చేశారు.
బీజేపీతో జనసేనకు పొత్తు ఉందని, అయినప్పటికీ ఎక్కడో సరిగా లేదనే భావన కనపడుతోందని పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపాయి. బీజేపీ, జనసేనల మధ్య గ్యాప్ ఉందన్న విషయం తమకూ, బీజేపీ నాయకత్వానికి కూడా తెలుసని పవన్ అన్నారు. బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకే తాను రోడ్ మ్యాప్ అడిగానని, కానీ, వారు ఆ రోడ్ మ్యాప్ పై స్పందించకపోవడం వల్ల తనకు టైం వేస్ట్ అవుతోందని పవన్ చెప్పారు.
అయితే, తనకు పదవుల మీద వ్యామోహం లేదన్న పవన్…రౌడీలు రాజ్యాలు ఏలుతుంటే, గూండాలు గదమాయిస్తుంటే చూస్తూ ఊరుకోబోనని అన్నారు. ప్రజలను కాపాడుకోవడానికి వ్యూహాలను ఎప్పటికపుడు మార్చుకోవాల్సి వస్తుందని పరోక్షంగా బీజేపీతో పొత్తుపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ప్రధాని మోదీకి కానీ, బీజేపీకి కానీ తాను వ్యతిరేకం కాదని పవన్ అన్నారు. బీజేపీని ఎప్పుడూ గౌరవిస్తామని, కానీ, ఊడిగం చేయలేమని పవన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమయ్యాయి.
పవన్ మంగళగిరిలో ఆ వ్యాఖ్యలు చేయడానికి ముందు పవన్ కు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత వీరిద్దరూ కలిసి మీడియా ముందుకు రావడంతో బీజేపీ, జనసేనల పొత్తు సజీవంగా ఉందని అంతా అనుకున్నారు. పవన్ కు సోము సంఘీభావం ప్రకటించడం, విశాఖలో వైసీపీ గర్జన ప్రభుత్వం స్పాన్సర్ చేసిన కార్యక్రమం అని సోము ఆరోపించడంతో పవన్ తో బీజేపీ ప్యాచప్ చేసుకుందని భావించారు.
మిత్రపక్షం జనసేన పార్టీ అధినేత పవన్ తో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించానని సోము చెప్పడంతో ఈ రెండు పార్టీలు ఇకపై కలిసి పని చేస్తాయని అనుకున్నారు. కానీ, సోము కామెంట్ల తర్వాత కూడా బీజేపీతో పొత్తుపై ఊడిగం చేయబోమంటూ పవన్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తాజాగా పవన్ కామెంట్లతో బీజేపీతో జనసేన పొత్తు ముగిసినట్లేనని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates