ఒకవైపు మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక జరుగుతోంది. మరోవైపు కేసీయార్ వెళ్ళి వారం రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఇక్కడేమో ఉపఎన్నిక పోలింగ్ దగ్గరకు వచ్చేస్తోంది. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనున్న విషయం అందరికీ తెలుసు. నామినేషన్లు వేసిన తర్వాత టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి తరపున కేసీయార్ కనీసం రెండు బహిరంగసభల్లో అయినా పాల్గొంటారని పార్టీ నేతలు అనుకున్నారు. అయితే కేసీయార్ అసలు రాష్ట్రంలోనే లేరు.
ఇదే అభ్యర్ధికి టెన్షన్ పెంచేస్తోంది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు లక్నో వెళ్ళారు. అట్నుంచి అటే ఢిల్లీకి వెళ్ళిపోయిన కేసీయార్ అక్కడే మకాం వేసున్నారు. రెండురోజులుగా జ్వరం కారణంగా ఎవరినీ కలవలేదంటున్నారు. మరి అంతకుముందు ఐదురోజులు ఏమిచేసినట్లు ? ఒకరోజు టీఆర్ఎస్ భవననిర్మాణాన్ని పర్వవేక్షించారు. మరి మిగిలిన రోజులంతా ఏమిచేస్తున్నారో ఎవరికీ తెలీదు.
పైగా సోమవరం మధ్యాహ్నం చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సమాచారశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ను ఢిల్లీకి అత్యవసరంగా పిలిపించుకున్నారు. మరి ఏ అవసరమై వీళ్ళని పిలిపించుకున్నారో తెలీదు. ఢిల్లీ నుండే మునుగోడు ఉపఎన్నికను సమీక్షిస్తున్నారట. ఇలా ఫోన్లలో ఎన్నికల ప్రక్రియను సీఎం సమీక్షిస్తే పార్టీలో రావాల్సినంత ఊపురాదు. చీఫ్ సెక్రటరీ, డీజీపీని ఢిల్లీ పిలిపించుకున్నారంటే అక్కడినుండి తిరిగి హైదరాబాద్ కు ఇప్పుడిప్పుడే రారనే ప్రచారమైతే మొదలైంది.
మరక్కడ కూర్చుని ఏమిచేస్తున్నారో, హఠాత్తుగా చీఫ్ సెక్రటరీ, డీజీపీలను ఎందుకు పిలిపించుకున్నారో ఎవరికీ అర్ధంకావటం లేదు. హైదరాబాద్ లో లేక ఢిల్లీలో ఉండే జాతీయపార్టీ నేతల ప్రముఖులతోను కలవక మరేం చేస్తున్నట్లు ? కేసీయార్ వెంబడి కూతురు, ఎంఎల్సీ కవిత కూడా ఉన్నారని సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె పేరు తరచూ వినబడుతోంది. బహుశా ఈ విషయంగానే ఢిల్లీలో మకాం వేశారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates