జ‌నం గొంతు నొక్కుతారా? : నిప్పులు చెరిగిన ప‌వ‌న్‌

‘జనవాణి’ కార్యక్రమం కోసం ఉత్తరాంధ్ర పర్యటన సుమారు 3 నెలల క్రితమే నిర్ణయించామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. వైసీపీ నేతలు మూడు రాజధానులపై కార్యక్రమం ప్రకటించడానికి కంటే మూడు రోజుల ముందే తాము విమాన టికెట్లు కూడా బుక్‌ చేసుకున్నామని చెప్పారు. తమ పర్యటనతో వైసీపీ కార్యక్రమాన్ని భగ్నం, నిర్వీర్యం చేయాలనే ఆలోచన లేదన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో పవన్‌ మాట్లాడారు.

విమానాశ్రయంలో జరిగిన ఘటన, జనసేన కార్యకర్తల అరెస్టులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము, తమ పార్టీ కార్యక్రమాలు నడిపే విధానం గురించి వైసీపీ ఎలా చెబుతుందని ప్రశ్నించారు. అసలు వాళ్లకి సంబంధమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యక్రమాలు ఎలా చేయాలో మేం చెబుతున్నామా? అని మండిపడ్డారు.

“జనవాణి ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపించడం.. వాటిని సంబంధిత శాఖలు, మీడియా దృష్టికి తీసుకెళ్లడం. జనవాణి అంటే జనం గొంతు. అలాంటి కార్యక్రమం చేపడితే జనం గొంతు నొక్కేస్తామంటే ఎలా? ఇంతవరకు ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదు. ముందస్తుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకుని ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకుండా విధానపరంగానే మాట్లాడుతుంటాం. వైసీపీకి 30 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎంతసేపూ బూతు పురాణం తప్ప ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే ప్రజలు మా వద్దకు ఎందుకొస్తారు? భూ నిర్వాసితులు, పింఛన్లు, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ యువత, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు.. ఇలా 3వేలకు పైగా సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వాటిని సంబంధిత శాఖలకు తెలియజేశాం. వైసీపీకి పోటీగా ‘జనవాణి’ చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ఎన్నికల సమయంలోనే పోటీ.. ఇప్పుడు సమస్యల పరిష్కారానికి మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టాం.” అన్నారు.

“పోలీసు శాఖకే గౌరవం ఇవ్వని వ్యక్తి.. రాష్ట్రానికి సీఎం.. పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి కుటుంబం నుంచి వచ్చినవాడిని. ఆ శాఖపై ప్రత్యేకమైన గౌరవం, అభిమానం ఉంటుంది. పోలీసులు నిర్ణయాలు తీసుకోరు.. ఏం తీసుకోవాలన్నది రాజకీయ నేతలే నిర్ణయిస్తుంటారు. శనివారం మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారో ప్రజలు చూశారు. మాపై పోలీసులు జులుం చూపుతూ వైసీపీ ప్రభుత్వానికి అడ్డగోలుగా కొమ్ముకాశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును పోలీసులు ఎందుకు పరిష్కరించలేకపోయారు? ” అని ప్ర‌శ్నించారు.

ఏపీ పోలీసులపై నమ్మకం లేదని చెప్పిన వ్యక్తి కింద ఈ పోలీసులు పనిచేస్తున్నారని అన్నారు. మీ శాఖకే గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్రానికి సీఎంగా ఉన్నార‌ని అన్నారు. “నేను బస చేసిన హోటల్‌ వద్ద వేకువజామున 3-4 గంటల వరకు పోలీసు అధికారులు తిరిగారు. గంజాయి దొంగలను వదిలేయండి.. దోపిడీదారులు, నేరస్థులకు కొమ్ముకాయండి.. సామాన్యుల గొంతు వినిపించే జనసేనను మాత్రం ఇలా ఇబ్బంది పెట్టండి. జనవాణి కార్యక్రమంలో గొడవ చేయాలనేదే వారి ఉద్దేశం.” అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ పర్యటనలో మూడు రాజధానుల అంశం త‌మ‌ దృష్టిలో లేదన్నారు. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని అన్నారు. 2014లోనే కర్నూలునో, విశాఖనో నిర్ణయించి ఉంటే అదే ఉండేదన్నారు. రాజు వచ్చినప్పుడల్లా రాజధాని మారుస్తామంటే ఎలా? అని ప్ర‌శ్నించారు. సీఎం మారితే రాజధాని మారిపోవాలా? అని ప్ర‌శ్నించారు. “నిజంగా మీకు ఉత్తరాంధ్ర, రాయలసీమపై అంత ప్రేముందా? రాయలసీమ నుంచి అంతమంది సీఎంలుగా వచ్చినా ఎందుకు ఆ ప్రాంతం వెనుకబడింది? అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులు కట్టరెందుకు? ఉత్తరాంధ్ర నేతల్లో లేని వెనుకబాటుతనం ప్రజల్లోనే ఎందుకుంది?”అని పవన్‌ నిలదీశారు.