అడ్డంగా దొరికిపోయిన వైసీపీ

ఇది డిజిట‌ల్ యుగం. సోష‌ల్ మీడియా హ‌వా సాగుతున్న కాలం. ఈ రోజుల్లో ఇంట‌ర్నెట్లో దొరికిన ఫొటోను, వీడియోను తీసుకొచ్చి ఫేక్ ప్ర‌చారాలు చేస్తే అంతే సంగ‌తులు. ఫొటోల‌ను కూడా సెర్చ్ చేసి వాటి వివ‌రాల‌న్నీ బ‌య‌టికి తీసేసే టెక్నిక‌ల్ కింగ్స్ సోష‌ల్ మీడియాలో బోలెడుమంది ఉంటారు.

అందులోనూ సున్నిత‌మైన అంశాల విష‌యంలో ఇలాంటి త‌ప్పులు చేసి దొరికిపోతే నెటిజ‌న్ల‌ వాయింపుడు మామూలుగా ఉండ‌దు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సోష‌ల్ మీడియాలో ఇదే అనుభ‌వం ఎదురైంది. వికేంద్రీక‌ర‌ణ‌, మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా విశాఖ‌ప‌ట్నంలో విశాఖ గ‌ర్జ‌న కార్య‌క్ర‌మం చేప‌డుతున్న నేప‌థ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ హ్యాండిల్లో కొన్ని పోస్టులు పెట్టారు.

ఒక మ‌త్స్య‌కార మ‌హిళ తాను విశాఖ రాజ‌ధానికి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు, ఒక రైతు తాను మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న‌ట్లుగా ఈ పోస్టులు ఉన్నాయి. ఐతే ఇందులో వాడిన మ‌త్స్య‌కార‌ మ‌హిళ‌, రైతు ఫొటోలు మ‌న‌వాళ్ల‌వి కావు. ఎక్క‌డో ఇంట‌ర్నెట్ నుంచి ఎత్తుకొచ్చిన‌వి. మ‌హిళ ఫొటో 2013లో గోవాలో తీసింది. దానికి సంబంధించిన ఆధారం ఇంట‌ర్నెట్లో ఉంది.

మ‌రోవైపు ఒరిస్సాలో బ‌ల‌రామ్ యోజ‌న అనే ప్ర‌భుత్వ ప‌థ‌కానికి డిజైన్ చేసిన యాడ్‌లో ఉన్న వ్య‌క్తి ఫొటోను ప‌ట్టుకొచ్చి ఆంధ్రా రైతుగా ఇంకోదాంట్లో చూపించారు. విశాఖ గ‌ర్జ‌న నేప‌థ్యంలో ఈ రెండు పోస్టుల‌ను వెరిఫైడ్ వైఎస్సార్ సీపీ ట్విట్ట‌ర్ హ్యాండిల్లో పోస్టు చేయ‌డం విశేషం. ఐతే ఇలా ఆ పోస్టులు పెట్టారో లేదో.. కాసేప‌టికే వాటి వెనుక అస‌లు గుట్టును బ‌య‌ట‌పెట్టేసిన నెటిజ‌న్లు వైసీపీ వాళ్ల‌ను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇలా అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టాక కూడా వైసీపీ హ్యాండిల్ నుంచి ఈ ఫొటోలు డెలీట్ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.