రాష్ట్రంలో చిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత లేదు. ఆయన విజన్ కావొచ్చు.. లేదా.. ఆయన వేసిన బాట కావొచ్చు. నేడు ఉపాధి హామీ పథకం రయ్ రయ్యన దూసుకుపోతున్నా.. వివిధ పరిశ్రమలు ప్రారంభం అవుతున్నా.. చంద్రబాబు వేసిన పునాదులేనని.. అందరూ చెబుతున్నారు. దీనిని వైసీపీ నాయకులు కూడా ఖండించలేక పోతున్నారు. ఎందుకంటే.. తమ మూడేళ్ల హయాంలో ఏమీ తీసుకురాలేక పోయారు కాబట్టి..!
ఇక, జగన్‌పై ప్రజలకు నమ్మకం ఉందా? అంటే.. ఆయన కేంద్రానికి సాగిల పడుతున్నంతవరకు బాగానే ఉంది. కానీ, రేపు ఏదైనా తేడా వస్తే.. ఆయనపై కేసులు పుంజుకుంటే.. మాత్రం ఆయన పక్కకు తప్పుకోవాల్సిందే. పైగా.. తెలంగాణతో అనుసరిస్తున్న వైఖరిపై.. ప్రజలు గుర్రుగా ఉన్నారు. విభజన హామీలను నెరవేర్చలేదు. కనీసం.. ప్రత్యేక హోదా ఊసు కూడా ఎత్తడం లేదు. తాను చేసిన చట్టాలను తానే వెనక్కి తీసుకుంటున్నారు. దిశను ఇప్పటి వరకు ఆమోదించుకోలేక పోయారు.
మూడు రాజధానులనే మాటను తెచ్చారు కానీ.. ఏ ఒక్క వర్గంతోనూ.. ఆమోద ముద్ర వేయించుకోలేకపోతున్నారు. కేంద్రంతో చెలిమి ఉండాలన్న జగన్.. ఆదిశగా చేస్తున్న ప్రయత్నాల వల్ల ఏపీకి ఏమీ చేయలేక పోయారు. ఫలితంగా.. నమ్మకం.. విశ్వసనీయత అనే విషయాలను పరిశీలిస్తే.. జగన్‌పై పెద్దగా ప్రజలు రియాక్ట్ కావడం లేదు. పోనీ.. అలాగని.. టీడీపీపై పెద్ద సానుకూలత ఉందా? అంటే.. ఆదిశగా కూడా .. ఆ పార్టీ పుంజుకోలేక పోతోంది. చంద్రబాబుపై ఉన్న నమ్మకం.. ఇతర నేతలపై కనిపించడం లేదు.
దీంతో రాష్ట్రంలో రాజకీయ శూన్యత భారీగా పెరిగిపోయింది. ఈ పరిణామాలను గమనిస్తున్న వైసీపీ.. తమకు విజయం తథ్యమని చెబుతోంది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. 150సీట్లలో కనీసం.. సగం దక్కించుకోవడం కష్టమని.. అధిష్టానానికి కూడా తెలుసు. అందుకే.. ఇప్పటి వరకు నియోజకవర్గాలకు పరిమితమైన సమీక్షలను ఇప్పుడు.. మండల స్థాయికి తీసుకువెళ్లారు.
అయితే.. జగన్‌పై జనం మూడ్ మారే వరకు … ఈ ప్రయత్నాలు సఫలీకృతం కావడం కష్టమని అంటున్నారు పరిశీలకులు. ఇక, టీడీపీ కూడా.. క్షేత్రస్థాయిలో పుంజుకుంటే తప్ప.. ప్రయోజనం లేదని చెబుతున్నారు. మొత్తానికి ఏపీలో రెండు కీలక పార్టీలు కూడా.. ఒక రకమైన సందిగ్ధావస్థను ఎదుర్కొంటున్నాయని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates