అది విశాఖకు బిగ్ డే

ఈనెల 15వ తేదీన విశాఖపట్నంలో చాలా బిజీ యాక్టివిటీస్ జరగబోతున్నాయి. ఒకేరోజు మూడు పార్టీలకు సంబంధించిన భారీ కార్యక్రమాలు జరగబోతుండటంతో ఆరోజు నగరం చాలా బిజీబిజీగా ఉండబోతోంది. కాకపోతే పార్టీ కార్యక్రమాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉంటే అదే పదివేలు. మొదట ప్రజాగర్జన విషయం చూద్దాం. మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణకు మద్దతుగా పొలిటికల్ జేఏసీ నాయకత్వంలో ప్రజాగర్జన జరగబోతోంది.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి జేఏసీ అవసరమైన చర్యలు తీసుకుంటోంది. సహజంగానే ఈ కార్యక్రమానికి అధికార పార్టీ మద్దతుంటుందని తెలిసిందే. దీనికి వీలుగా ఇప్పటికే మంత్రులు, ఎంఎల్ఏలు తమ నియోజకవర్గాల్లో, జిల్లాల్లో బాగా ప్రచారం చేస్తున్నారు. జనసమీకరణ విషయంలో టార్గెట్లు కూడా పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక జనసేన అధినేత విషయం పవన్ కల్యాణ్ విషయం తీసుకుంటే అదేరోజు జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నేతలు, శ్రేణులతో సమావేశాలు కూడా పెట్టుకున్నారు. ఇప్పటికే మూడు రాజధానులకు వ్యతిరేకంగా పవన్ పదే పదే ట్విట్లు చేస్తున్న కారణంగా మంత్రులు మండిపోతున్న విషయం తెలిసిందే. పేరుకు జనవాణి కార్యక్రమం, నేతలు, శ్రేణులతో సమావేశమే అయినా కచ్చితంగా మూడు రాజధానుల విషయాన్ని కూడా పవన్ ప్రస్తావిస్తారు. దాంతో ఆ విపరిణామాలు ఏంటో ఆరోజు తెలుస్తాయి.

జనసేన కార్యక్రమం సరిపోదన్నట్లు తెలుగుదేశం పార్టీ కూడా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. రైతుల పాదయాత్ర విషయంలో అనుసరించాల్సిన విధానం, వైసీపీ డ్రామాలను బయటపెట్టడం, అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండుతో సమావేశం జరగబోతోంది. విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం జరగబోతోంది. కాబట్టి సమావేశం జరిగే ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి ఒకే అంశంపై విశాఖనగరం ఈనెల 15వ తేదీన అట్టుడికిపోయే అవకాశమైతే స్పష్టంగా కనబడుతోంది.