భూమా అఖిలప్రియ..ఈపేరు వింటేనే జనాలకు అనేక వివాదాలు గుర్తుకొస్తాయి. ఆమే కావాలని వివాదాలను సృష్టిస్తోందా లేకపోతే వివాదాలే ఆమెను వెతుక్కుంటు వెళుతున్నాయా అన్నదే ఎవరికీ అర్ధం కావటంలేదు. ఇదంతా ఎందుకంటే తన తల్లి, దండ్రులైన దివంగత ఎంఎల్ఏ దంపతులు భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిపైన చీటింగ్ కేసు నమోదు అవటానికి అఖిలప్రియ కారణం అవటమే.
కేవలం డబ్బుకోసమే అఖిల, సోదరి మౌనిక, తమ్ముడు జగద్విఖ్యాతరెడ్డి తమ తల్లి, దండ్రుల పరువు సాంతం తీసేశారనే గోల కర్నూలు జిల్లాలో పెరిగిపోతోంది. అఖిల సోదరుడు భూమా కిషోర్ రెడ్డి అయితే నాగిరెడ్డి వారసులపై మండిపోతున్నారు. తల్లి, దండ్రుల కడుపున చెడబుట్టారంటూ శాపనార్ధాలు పెట్టారు. తల్లి చనిపోతే చిన్నవయసులోనే అఖిల ఎంఎల్ఏ అయిపోయింది. తండ్రి చనిపోవటంతో కారుణ్యనియామకాల పద్దతిలో మంత్రి కూడా అయిపోయింది.
ఎంఎల్ఏ అవటం, మంత్రయిపోవటం చకచకా జరిగిపోవటంతో అఖిలకు పట్టపగ్గాలు లేకుండా పోయింది. కుటుంబానికి తానే పెద్దదిక్కవటంతో ఇక అడ్డుచెప్పే వాళ్ళు కూడా లేకుండా పోయారు. మంత్రిగా ఉన్నపుడే రెండో వివాహం చేసుకున్నది. ఎప్పుడైతే రెండో వివాహం చేసుకున్నదో అప్పటినుండే తరచూ వివాదాల్లో ఇరుక్కోవటం మొదలైంది. భర్త భార్గవ్ చాలా దూకుడుమనిషనే ప్రచారం అందరికీ తెలిసిందే. స్వతహాగా అఖిలే దూకుడుమీదుంటారు. దానికి భర్త భార్గవ్ , తమ్ముడు జగత్ రూపంలో ఇద్దరు తోడయ్యారు.
దాంతో ప్రత్యర్ధులపై దాడులు, కిడ్నాపులు, భూకబ్జాలు, హత్యలకు కుట్రలు, ఫోర్జరీ సంతకాలు, తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించటం లాంటి అనేక కేసుల్లో అఖిల కుటుంబమంతా ఇరుక్కునుంది. ప్రస్తుతం మాజీమంత్రి, ఆమె భర్త, సోదరుడు బెయిల్ మీద తిరుగుతున్నారు. తొందరలో ఎన్నికలు వస్తున్నాయి. ఏ పార్టీ తరపున పోటీచేస్తుందో తెలీదు. ఎందుకంటే ఏ పార్టీకూడా ఆమెను ఆదరించటానికి సిద్ధంగా లేదు. మొత్తంమీద రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునైనా కాస్త కంట్రోల్లో ఉండాలని అఖిలకు అనిపించకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.