మీ ‘గ‌ర్జ‌న‌’ ఎవ‌రిని ముంచ‌డానికి?: ప‌వ‌న్

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంపై జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిప్పులు చెరిగారు. మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై మండిపడ్డారు. దేని కోసం వైసీపీ ప్రభుత్వం గర్జనలు నిర్వహిస్తోందని ప్రశ్నించారు. మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయటానికా? అని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి భిన్నంగా చేస్తున్నందుకా? అంటూ నిలదీశారు.

ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేకపోయినందుకు, మత్స్యకారులకు సొంత తీరంలో వేటకు అవకాశం లేక గోవా, గుజరాత్, చెన్నై వెళ్లిపోతున్నందుకు గర్జనలు నిర్వహిస్తున్నారా? అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో రుషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసి తమ కోసం భవనం నిర్మించుకొంటున్నందుకా?, దసపల్లా భూములను తమ సన్నిహితులకు ధారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చినందుకా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

వైసీపీ ప్రభుత్వం చెబుతున్న రాజధాని వికేంద్రీకరణపై పవన్ కల్యాణ్ మూడు ప్రశ్నలు సంధించారు. మూడు నగరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఆర్థికపరమైన అధికారాలు ఎందుకు ఇవ్వటం లేదన్నారు.

కనీసం కేంద్రం ఇచ్చిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు ఇవ్వటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 73,74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు దక్కిన అధికారాలు అమలు చేస్తే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. మనసు లోతుల్లో నుంచి వచ్చే శక్తివంతమైన ఆలోచనకు.. భ్రష్టుపట్టిన వ్యవస్థను కూకటివేళ్లతో సహా పెకిలించే శక్తి కలిగి ఉంటుందని పవన్ వ్యాఖ్యానించారు.

ఆ ఆలోచన చిన్న అలజడిలా మొదలై, విప్లవంగా మారి… సమాజాన్ని ప్రభావితం చేసే బడబాగ్నిలా మారుతుందని హెచ్చరించారు. అలాంటి లోతైన ఆలోచన ఎన్ని అవాంతరాలు వచ్చినా చెదరదు, బెదరదని స్పష్టం చేశారు. అడ్డంకులను సైతం పగులగొట్టుకుని రెప్పపాటులోనే కార్చిచ్చులా వ్యాపిస్తుందని హెచ్చరించారు.