ఏదో ఒక సందర్భంలో.. పార్టీని బజారున పడేశారు.. అంటే.. సర్దుకోవచ్చు. లేదా రెండు సందర్భాల్లో అం టే.. ఓర్చుకోవచ్చు. పదే పదే అదే పనిచేస్తే.. ఇంకా ఎన్నిసార్లు.. ఓర్చుకోవాలి? ఇదీ..ఇప్పుడు విజయవాడ టీడీపీ రాజకీయాలపై పార్టీ అభిమానులు సంధిస్తున్న ప్రశ్న. విజయవాడ ఎంపీ.. కేశినేని నాని వ్యవహారం .. ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆయన ఏం చేస్తున్నారో.. ఏం చేస్తారో.. కూడా ఎవరికీ తెలియడం లేదు. పార్టీ ఇప్పుడు అత్యంత కీలకమైన పరిస్థితిలో ఉంది.
రోజు రోజుకు రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఇలాంటి సందర్భంలో నాని.. వంటి సీనియర్ ఎంపీ.. పార్టీని ముందుండి నడింపించాల్సింది పోయి.. పార్టీని ఇరకాటంలోకి నెట్టే పనులు చేయడమే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. గత మూడేళ్లుగా.. కూడా.. ఇదే పద్ధతిలో నాని నడుస్తున్నాడనేది పార్టీ అభిమానుల మాట. లోకల్ నేతలతో కయ్యానికి కాలు దువ్వడం.. పార్టీపై సటైర్లు వేయడం.. శత్రువులతో స్నేహం చేస్తానని హెచ్చరించడం.. కీలకనేతలను అభాసుపాల్జేయడం.. వంటివి ఆయనకు నిత్య కృత్యంగా మారాయని అంటున్నారు.
తాజాగా విజయవాడ పార్లమెంటు ఇంచార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి నెట్టెం రఘురామ్‌పైనా.. కేశినేని నాని విమర్శలు, సటైర్లు సంధించారు. ‘పార్టీలో క్రమ శిక్షణ ఉందా?’ అనే ప్రశ్నలు సంధించారు. ఒక విషయాన్ని పురస్కరించుకుని.. పార్టీ క్రమ శిక్షణా సంఘానికి ఫిర్యాదు చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని..నెట్టెం ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ఎంపీ కేశినేని నాని.. “మన పార్టీలో క్రమ శిక్షణ సంఘం ఉందా? ఉంటే.. నేను రుజువులు ఆధారాలతో కొన్ని పంపిస్తాను.. చర్యలు తీసుకోండి చూద్దాం” అని వ్యంగ్యాస్త్రం సంధించారు.
అంటే.. నాని ఉద్దేశంలో పార్టీలో క్రమశిక్షణ లేదని.. ఎవరి ఇస్టానుసారం వారు వ్యవహరిస్తున్నారనే భావన ఉంది. అయితే..నిజంగానే ఆయన ఈ భావన ఉంటే.. దీనిని పెద్దల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కానీ, ఇలా పార్టీ పరువును బజారున పడేయడం ఎందుకు? అనేది పార్టీ అభిమానుల మాట. ఇక, చంద్రబాబు సైతం.. ఇలా పార్టీని రోడ్డుకు లాగుతున్న వారి విషయంలో ఎందుకు ఉపేక్షిస్తున్నారనేది కూడా మిలియన్‌డాలర్ల ప్రశ్న. మరి ఇప్పటికైనా.. ఇలాంటి వారిని అదుపు చేయకపోతే.. రేపు మరింత మంది పార్టీకి గుదిబండలు మారడం ఖాయమని అభిమానులు హెచ్చరిస్తున్నారు.