ప‌క్కాలెక్క‌లు ఉన్న‌ప్పుడు కాగ్ మొట్టికాయ‌లేల‌ బుగ్గ‌న సార్‌!

Buggana Rajender Reddy
Buggana Rajender Reddy

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంలో ఖ‌ర్చు పెట్టిన ప్రతి రూపాయికీ లెక్కలున్నాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. అదేస‌మ‌యంలో ప‌నిలో ప‌నిగా ఆయ‌న గ‌త టీడీపీ ప్ర‌భుత్వంపై రాళ్లేశారు. ఆ ప్రభుత్వంలోనే అప్పులు అసాధారణంగా పెరిగాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక నిర్వహణ మెరుగు పడిందన్నారు. ఆర్థిక పరిస్థితి దారణంగా దిగజారిందని అప్పులు 8 లక్షల కోట్లకు చేరిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలు అవాస్తవాలని అన్నారు.

అంతేకాదు.. ఓర్వలేక చేస్తున్న విమ‌ర్శ‌లుగా ఆయ‌న య‌న‌మ‌ల‌పై మండి ప‌డ్డారు. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 8 వేల కోట్లు ఆదాయం తగ్గిందని బుగ్గన అన్నారు. ఓ వైపు వనరులు తగ్గుతున్నా సంక్షేమ పథకాలు ఏవీ ఆపకుండా ప్రజల ఖాతాల్లోకి రూ.57 వేల 512 కోట్లు జమ చేసి ప్రజలను ఆదుకున్నామన్నారు. అంతేకాదు.. టీడీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇప్పటి పరిస్థితి పోల్చి చూడాలని స‌ల‌హా ఇచ్చారు.

వైసీపీ హయాంలో 2019-22 మధ్య మూడేళ్లలో పబ్లిక్ సెక్టారు యూనిట్లు తీసుకున్న అప్పులతో కలిపి చేసిన అప్పులు 15.5 శాతం మాత్రమే పెరిగాయన్నారు. వేస్ అండ్ మీన్స్ను రిజర్వు బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వా లకు కల్పించిన సదుపాయమని, ఆయా ప్రభుత్వాల ఆర్థిక అవసరాలను బట్టి ఎన్ని సార్లైనా వేస్ అండ్ మీన్స్కు వెళ్లవచ్చన్నారు. వైసీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వెళ్తే ఎందుకు అనుమతిస్తుందని ఎదురు ప్ర‌శ్నించారు. ఓవర్ డ్రాఫ్టు తీసుకోవడం, తిరిగి చెల్లించడం జరుగుతుందని, ఇది అదనపు అప్పు కాదన్నారు.

ఆర్థిక నిపుణుల ప్ర‌శ్న‌లు ఇవే!

మంత్రి బుగ్గ‌న చెప్పిన‌.. వాద‌న‌పై ఆర్థిక నిపుణులు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. అన్ని లెక్క‌లు ప‌క్క‌గా ఉన్న‌ప్పుడు.. కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్‌(కాగ్‌) రాష్ట్రానికి ప‌దే ప‌దే లేఖ‌లు ఎందుకు రాస్తున్న‌ట్టు? అని ప్ర‌శ్నిస్తున్నారు.

  • క‌రోనా స‌మ‌యంలో ఆర్థిక వ్య‌వస్థ కుప్ప‌కూలింద‌న్న బుగ్గ‌న‌.. దీనిని నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేయ‌కుండా.. అప్పులు చేయ‌డం ద్వారా.. ఆర్థికాన్ని స‌రిదిద్దామ‌ని చెప్ప‌డం స‌రైందేనా?
  • ప్ర‌జ‌ల‌కు 57 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగానే సంక్షేమం అందించామ‌ని చెబుతున్న బుగ్గ‌న ఆ సొమ్మును అప్పుల ప‌ద్దులోనే క‌లిపారు క‌దా! దీనిని ఏమంటారు?
  • వేస్ అండ్ మీన్స్ త‌ప్పు కాదు.. కానీ, కార్పొరేష‌న్ల ను అడ్డు పెట్టి.. తీసుకువ‌చ్చిన అప్పుల సంగ‌తిని మాత్రం ఎందుకు చెప్ప‌డం లేద‌నేదే ప్ర‌ధాన ప్ర‌శ్న‌. మ‌రి ఈవిష‌యాన్ని ఎందుకు దాస్తున్నారు?
  • మ‌ద్యంపై పాతికేళ్ల పాటు వ‌చ్చే ఆదాయాన్ని అడ్డు పెట్టుకుని తెచ్చిన అప్పు ప‌రిస్థితి ఏంటి? ఇవ‌న్నీ దాచారు క‌దా.. దీనినే చెప్పాల‌ని అంటున్నాయి ప్ర‌తిప‌క్షాలు. అస‌లు విష‌యం మ‌రిచి.. మ‌సిపూసే ప‌రిస్థితి రావ‌డమే ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌ని అంటున్నారు.