చిరంజీవితో గంటా భేటీ.. పొలిటిక‌ల్ ఇంట్ర‌స్టేనా?

మాజీ మంత్రి, టీడీపీ నాయ‌కుడు.. విశాఖ ఉత్త‌రం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు.. తాజాగా మెగా స్టార్ చిరంజీవితో భేటీ కావ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇటీవ‌ల విడుద‌లైన గాడ్ ఫాద‌ర్ మూవీ స‌క్సెస్ లో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌లో గంటా శ్రీనివాస‌రావు.. చిరుతో భేటీ అయి.. అభినందించారు. అయితే.. ఈ సందర్భంగా.. వీరి మ‌ధ్య రాజ‌కీయ ప్ర‌స్తావ‌న కూడా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

ప్ర‌స్తుతం రాజ‌కీయంగా టీడీపీలో ఉన్న గంటా.. ఆ పార్టీలో యాక్టివ్‌గా అయితే లేరు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ పైనా..క్లారిటీ లేదు. మ‌హానాడు నిర్వ‌హించిన‌ప్పుడు కూడా.. ఆయ‌న రాలేదు. పార్టిసిపేట్ చేయ‌లేదు. ఇక‌, చంద్ర‌బాబు కూడా.. గంటాను ఆయ‌న ఇష్టానికే వ‌దిలేసిన‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో చిరుతో గంటా భేటీ ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. గ‌తంలో 2007లో ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు.. గంటా పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు.

త‌ర్వాత‌..కాంగ్రెస్‌లో ప్ర‌జారాజ్యం విలీనం అయిన‌ప్పుడు కాంగ్రెస్‌లో మంత్రి ప‌ద‌విని కూడా పొందారు. ఈ క్ర‌మంలో చిరుతో భేటీ ప్రాధాన్యం ద‌క్కించుకుంది. ఎందుకంటే.. ఇటీవ‌ల చిరు.. తాను ప‌వ‌న్‌కు అండ‌గా ఉండేందుకు రెడీయేన‌ని ప్ర‌క‌టించారు. ప‌వ‌న్ కోరితే.. తాను ఆయ‌న‌కు వెన్నుద‌న్నుగా నిలుస్తాన‌ని కూడా ప్ర‌క‌టించారు. దీంతో జ‌నసేన దూకుడు పెరుగుతుంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో గంటా.. చిరు భేటీకి రాజ‌కీయంగా ప్రాధాన్యం ఏర్ప‌డింది.

టీడీపీకి దూరంగా ఉంటున్న గంటా.. ఎన్నిక‌లకు ముందు జ‌న‌సేన తీర్థం పుచ్చుకుంటార‌నే చ‌ర్చ సాగుతోంది. అయితే.. దీనిపై ఆయ‌న క్లారిటీ ఇవ్వ‌లేదు. పైగా.. వైసీపీ నుంచి ఆఫ‌ర్లు వ‌చ్చినా.. గంటా తిర‌స్క‌రిస్తున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో చిరుతో భేటీలో ఆయ‌న జ‌నసేన ఎంట్రీ గురించి ఏమైనా చ‌ర్చించారా? అనేది ఆస‌క్తిగా మారింది. చూడాలి.. మ‌రి ఏం జ‌రుగుతుందో!. కొస‌మెరుపు ఏంటంటే.. గంటా శ్రీనివాసరావు.. ఎప్పుడు ఎక్క‌డ ఏ పార్టీతో చేతులు క‌లిపినా.. ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కుతూనే ఉన్నారు.