తుమ్మల నాగేశ్వరరావు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై మంచి పట్టున్న నాయకుడిగా గుర్తింపు పొందారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల.. టీడీపీ తరఫున కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నారు. అయితే.. రాష్ట్ర విబజన తర్వాత..ఆయన టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. తర్వాత.. జరిగిన ఉపఎన్నికలో విజయం దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఆయనకు మంత్రి పదవిని అప్పగించారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేశారు.
అయితే.. ఆ ఎన్నికల్లో.. తుమ్మల.. కాంగ్రెస్ అభ్యర్థి.. ఉపేందర్ రెడ్డి పై ఓడిపోయారు. అయినా..కూడా పార్టీ కోసం.. పనిచేస్తానంటూ తుమ్మల ప్రకటించారు. కానీ, కొన్నాల్లకు ఉపేందర్‌రెడ్డి.. మంత్రి కేటీఆర్ అండ తో టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. ఇక, అప్పటి నుంచి ఆయన గులాబీ కండువా తీయడం లేదు. పైగా.. కేసీఆర్, కేటీఆర్ దగ్గర బాగా చనువు పెంచుకున్నారు. మరోవైపు.. తుమ్మలకు ఏదైనా పదవి ఇస్తారని ఆశించారు. అయినా..కేసీఆర్ ఆయను పట్టించుకోలేదు.
దీంతో కొన్నాళ్లు అలిగిన తుమ్మల.. వ్యవసాయం చేసుకున్నారు. అయితే.. ఎప్పుడైనా ఎన్నికలు సమీపించే అవకాశం ఉందని తెలియడంతో మళ్లీ రాజకీయంగా ఆయన యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. టీఆర్ఎస్ నుంచి తుమ్మలకు ఎలాంటి ఆహ్వానాలు అందడం లేదు. అసలు కేసీఆర్ నమ్మకస్తుల జాబితాలో ఒకప్పుడు.. తుమ్మల పేరు ప్రముఖంగా వినిపిస్తే.. ఇప్పుడు అది అట్టడుగుకు చేరిందనే వాదన ఉంది.
ఈ నేపథ్యంలో తనకు టికెట్ ఇస్తారన్న నమ్మకం కూడా.. తుమ్మలలో లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో ఉపేందర్‌రెడ్డికే.. పాలేరు టికెట్ ఇస్తారని అంటున్నారు. దీంతో తుమ్మల తన దారి తాను చూసుకున్నారు. తాజాగా ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు.. తెలుస్తోంది.ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్న తుమ్మల.. తన అనుచరులను కూడా మానసికంగా రెడీ చేస్తున్నారు.
కాంగ్రెస్ లో చేరినా.. అందరికీ న్యాయం చేస్తానని.. ఆయన హామీ ఇస్తున్నారు. మునుగోడు ఉప పోరు ముగియగానే.. తుమ్మల కాంగ్రెస్‌లోకి చేరిపోవడం ఖాయమని అంటున్నారు ఆయన అనుచరులు. బలమైన నాయకుడిగా ఉన్న తుమ్మలను చేర్చుకోవడం ద్వారా.. ప్రయోజనం ఉంటుందని.. కాంగ్రెస్ కూడా భావిస్తుండడం విశేషం.