టీడీపీతో పొత్తుపై తేల్చేసిన బీజేపీ నేత

కొద్ది రోజుల క్రితం టీడీపీతో పొత్తుల వ్యవహారంపై ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో ప్రధాని మోడీ రహస్య భేటీ జరిపారని టాక్ వచ్చింది. దాంతోపాటు, హైదరాబాద్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పొత్తులపై చర్చించారని ఊహాగానాలు వచ్చాయి. అయితే, సమయం, సందర్భాన్ని బట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులపై నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు క్లారిటీ ఇవ్వడంతో ఆ పుకార్లకు తెరపడినట్లు అయింది.

ఇటువంటి తరుణంలో ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్ఛా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో తప్ప మరే పార్టీతో తమకు పొత్తులేదని లక్ష్మణ్ కుండ బద్దలుకొట్టారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరగడంలేదని, బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని లక్ష్మణ్ అన్నారు.

ఇక, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారాన్ని దక్కించుకోవడం ఖాయమని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తామని లక్షణ్ చెప్పారు. కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని అన్నారు. కానీ, రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కూడా మరోసారి బీజేపీ ప్రభుత్వం ఉంటుందని, ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలే ఉండబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీతో పొత్తు ఉండదు అంటూ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి.