3 కోట్ల ఉద్యోగాలను మింగేసిన కరోనా

అభివృద్ధిలో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతోన్న అమెరికా వంటి అగ్రదేశాలు మొదలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న దేశాల వరకు కరోనా దెబ్బకు విలవిలలాడిపోతున్నాయి. కరోనా మహమ్మారి విసిరిన పంజాకు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. 2008లో చవిచూసిన ఆర్థిక మాంద్యంతో పోలిస్తే….కరోనా దెబ్బకు రాబోతోన్న ఆర్థిక మాంద్యం ప్రభావం ఎన్ని ఏళ్లు ఉంటుందో కూడా చెప్పలేమని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక, ఇప్పటికే జీడీపీలో వృద్ధిలేక నానా తిప్పలు పడుతోన్న మనదేశ ఆర్థిక వ్యవస్థను కరోనా కోలుకోలేని దెబ్బకొట్టిందని అంటున్నారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ ఎఫెక్ట్ తో భారత్ లో దాదాపు 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెబుతున్నారు.

అయితే, పోయిన ఉద్యోగాలలో 75 శాతం కంటే ఎక్కువ ఉద్యోగాలు లాక్ డౌన్ సడలించిన తర్వాత తిరిగి వచ్చాయని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు చెబుతున్నాయి. మే నెలలో 2 కోట్లకు పైగా, జూన్ నెలలో 7 కోట్లకు పైగా ఉద్యోగాలు తిరిగి వచ్చాయని, దీనిని బట్టి మొత్తంగా 12 కోట్ల ఉద్యోగాల్లో.. 9.1 కోట్ల ఉద్యోగాలు తిరిగి వచ్చాయని చెబుతున్నారు.

అయితే, గత ఏడాది జూన్ తో పోలిస్తే ఈ ఏడాది జూన్ లో ఇంకా 7.4 శాతం మందికి ఉపాధి దొరక లేదు. 2020 జూన్ లో వచ్చిన 7 కోట్ల ఉద్యోగాల్లో 4.44 కోట్ల ఉద్యోగాలు దినసరి కూలీలు, రోజువారీ వేతన జీవులు అందుకున్నారు. 75 శాతం కంటే ఎక్కువ ఉద్యోగులు డైలీవేజర్స్ కావడం విశేషం. లాక్ డౌన్ ఉన్నా, సడలించినా…90 శాతం కంటే ఎక్కువ ఉద్యోగాలు రోజువారీ సంపాదించేవారే కావడం విశేషం.

2019-20 లో సగటున 11 కోట్లకు పైగా ప్రజలు వ్యవసాయ ఆధారిత పనులు చేయగా..2020 జూన్‌ నెలకు వీరి సంఖ్య 13 కోట్లకు పెరిగింది. 2019-20 లో దేశవ్యాప్తంగా 8.6 కోట్ల మంది నెలవారీ జీతానికి పనిచేేసే ఉద్యోగులున్నారు. లాక్ డౌన్ వల్ల 2020 మే నెలలో వీరి సంఖ్య 7 కోట్లకు తగ్గింది.

అన్ లాక్ మొదలైన తర్వాత జూన్‌లో వారిలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు తిరిగి వచ్చాయి. రాబోయే 6 నెలలు ఎక్కడా పని లేకకపోతే.. అది నెలవారీ వేతనం ఉద్యోగులకు సుమారు రూ.2 లక్షల కోట్ల నష్టం మిగులుస్తుంది.