ప్రశ్నిస్తానంటూ..పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచనున్నారు. రేపటి నుంచి ఆయన తన సైన్యాన్ని రంగంలోకి దింపేందుకు రెడీ అవుతున్నారు. శనివారం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై అక్టోబర్ నెలలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన దృష్టి పెట్టారు. తాజాగా హైదరాబాద్‌లో పార్టీ నేతలతో ఆయన చర్చించారు. త్వరలోనే జిల్లాల వారీగా సమీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ సమీక్ష సమావేశాలు కృష్ణా జిల్లా, విజయవాడ అర్బన్లతో ప్రారంభించనున్నామన్నారు. మంగళగిరిలో జరిగే ఈ సమావేశాలకు సంబంధించి సూచనలు చేశారు. అలాగే క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయించిన వాలంటీర్లు, వీర మహిళలతో, సోషల్ మీడియా – శతఘ్ని క్రియాశీలక సభ్యులతోనూ సమావేశం కావాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు.
‘నా సేన నా వంతు’ కార్యక్రమంపై సమీక్ష చేపట్టనున్నారు. రాష్ట్ర యాత్ర నిర్వహణకు సంబంధించి కూడా చర్చ జరిగినట్లు నేతలు తెలిపారు. తొలుత కొండగట్టు ఆంజనేయ స్వామికి పూజలు జరిపి ధర్మపురి క్షేత్రానికి వెళ్లి శ్రీ నరసింహ స్వామిని దర్శించే విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అనంతరం తెలంగాణలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
మరోవైపు.. దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్లోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన పూజల్లో పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. సరస్వతిదేవి రూపంలో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే కార్యాలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్ అమ్మవారిని అర్చించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సకల శుభాలు కలుగచేయాలని ప్రార్థించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates