కేసీయార్ సొంత విమానం కొంటున్నారా ?

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా ? అనేది పాత సామెత. ఇపుడు రాజు తలచుకుంటే సొంత విమానానికి కొదవా అని చెప్పుకోవాలేమో. కేసీయార్ తొందరలోనే సొంత విమానం కొనుగోలు చేయబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అవసరాల కోసం సొంత విమానం ఉండాలని సీఎం డిసైడ్ అయ్యారట. తొందరలోనే టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.

తొందరలోనే జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా పర్యటనలు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. మరి అనుకున్నప్పుడల్లా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలంటే విమానాలు అందుబాటులో ఉండవు కదా. అలాగే ప్రతిసారి ప్రైవేటు విమానాలను అద్దెకు తీసుకోవాలంటే చాలా ఖర్చవుతుంది. అద్దెకు విమానం తీసుకోవటం కేసీయార్ కు పెద్ద కష్టమేమీకాదు. కానీ అద్దెలు చెల్లించే బదులు ఏకంగా సొంత విమానాన్నే కొనేస్తే పోలా అద్దిరిపోలా అని అనుకున్నారట.

దాంతో 15 సీట్ల కెపాసిటీ ఉన్న విమానం గురించి ఆరాతీస్తే రు.85 కోట్లవుతుందని చెప్పారట. తనకు కావాల్సిన పద్దతిలో ఇంటీరియర్ తీర్చిదిద్దుకుంటే సరిపోతుందని అనుకున్నారు. ఎప్పుడైతే కేసీయార్ ఆలోచన పార్టీ నేతలకు తెలిసిందే విరాళాలు ఇచ్చేందుకు పోటీపడుతున్నారట. ఇప్పటికే పార్టీ ఖాతాలో రు. 865 కోట్లున్నాయి. అయితే పార్టీ డబ్బులతో అవసరం లేకుండా తామే విరాళాలు ఇవ్వటానికి పోటీలు పడుతున్నారట.

ఎలాగూ ఎన్నికలు వస్తున్నాయి కదా టికెట్లు గట్రా వ్యవహారాలు చాలా ఉంటాయి. చాలా నియోజకవర్గాల్లో ఒకరికి మించి టికెట్ల కోసం పోటీలు పడుతున్నారు. ఎంఎల్ఏలకు కచ్చితంగా టికెట్లు రావని అనుకున్న నియోజకవర్గాల్లో చాలామంది నేతలు పోటీలు పడుతున్నారు. అలాంటి నియోజకవర్గాల్లో ఆశావహులు విమానం కొనుగోలుకు విరాళాలు ఇవ్వటానికి పోటీలు పడుతున్నారట. కాబట్టి విరాళాలకు కొదవుండదు కాబట్టి తొందరలోనే విమానం కొనేయటం ఖాయం.