తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి, మహిళా ఐఏఎస్ Smita Sabharwal సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సామాజిక సమస్యలపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పడంలో స్మితా సబర్వాల్ వెనుకాడరు. ఇటీవల బిల్కిస్ బానో రేప్ కేసు నిందితులను విడుదల చేయడాన్ని తప్పుబడుతూ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. గుజరాత్ ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే ఏకైక సివిల్ సర్వెంట్ స్మితా సబర్వాల్ అని కొందరు ప్రశంసించారు.
ఈ క్రమంలోనే తాజాగా దసరా సందర్భంగా స్మితా సబర్వాల్ చేసిన మరో ట్వీట్ పై దుమారం రేగింది. దసరా సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో స్త్రీ, పురుష నిష్పత్తిని తెలిపేలా భారత మ్యాప్ ను స్మితా సభర్వాల్ ట్వీట్ చేశారు. అన్ని రాష్ట్రాల్లో అమ్మను భక్తి శ్రద్ధలతో పూజిస్తామని, కానీ, స్త్రీ, పురుష నిష్పత్తిలో మాత్రం రాష్ట్రాన్ని బట్టి వ్యత్యాసముందని అర్థం వచ్చేలా ఆమె పోస్ట్ పెట్టారు. ఆ మ్యాప్ లో గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీలో మహిళల జనాభా తక్కువగా ఉంది. దాంతోపాటు, ఆ మ్యాప్ లో కశ్మీర్ సంపూర్ణంగా లేదు.
దీంతో, కొందరు నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించారు. మరికొందరు ఆమెను సపోర్ట్ చేశారు. ఈ క్రమంలోనో ఆ ట్వీట్ ను స్మితా సభర్వాల్ తొలగించి…క్షమాపణలు చెప్పారు. స్మితా పోస్ట్ చేసిన మ్యాప్ లో కశ్మీర్ విషయంలో పొరపాటు జరిగి ఉండొచ్చని, కానీ, స్త్రీల నిష్పత్తి తగ్గుతోందంటూ ఆమె చెప్పిన విషయం గొప్పదని కొందరు ప్రశంసిస్తున్నారు. దీంతో, ఈ విషయంలో తనకు సపోర్ట్ చేసినవారందరికీ స్మిత కృతజ్ఞతలు చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates