మాటల వేట‌తో.. మొదటికే మోసం గురూ!

నువ్వొక‌టంటే.. నేరెండంటా.. అనే ధోర‌ణిలో వైసీపీ నాయ‌కులు రెచ్చిపోతున్నారు. అయితే.. ఇది మొదటికే మోసం వ‌స్తుంద‌ని.. ప‌రిశీల‌కులు… వైసీపీ సానుభూతిప‌రులు కూడా హెచ్చరిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ విశ్వ‌విద్యాల‌యానికి పేరు మార్పు విష‌యం..ర‌చ్చ‌కు దారితీసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మంత్రులు మార్కులు వేయించుకునేందుకు త‌మ నోటికి ప‌ని చెప్పారు. ప‌రుషంగా కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కొన్ని విష‌యాల‌ను వ‌క్రీక‌రిస్తున్నార‌నే వాద‌న టీడీపీ నేత‌ల నుంచి కూడా వినిపిస్తోంది.

మ‌రీ ముఖ్యంగా మంత్రి దాడిశెట్టి రాజా, మంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్లాయి. ఎన్టీఆర్ డాక్ట‌ర్ కాదు కాబ‌ట్టి ఆయ‌న పేరును విశ్వ‌విద్యాల‌యానికి తీసేశామ‌ని.. ర‌జ‌నీ అన్నారు. వైఎస్సార్ డాక్ట‌ర్ కాబ‌ట్టి ఆయ‌న పేరును పెట్టామ‌ని స‌మ‌ర్థించుకున్నారు. ఇలా స‌మ‌ర్థించుకోవ‌డం ఆమెకు స‌రిపోయింది కానీ క్షేత్ర‌స్థాయిలో మాత్రం ప్ర‌జ‌లు దీనికి కౌంట‌ర్లు ఇస్తున్నారు. ఏ వృత్తి వారి పేర్లు.. ఆయా సంస్థ‌ల‌కు పెట్టాలంటే, విశాఖ‌లో క్రికెట్ మైదానానికి వైఎస్సార్ పేరు పెట్టారు క‌దా మ‌రి ఆయ‌న ఏ మ్యాచ్‌లో ఆడి దేశానికి కీర్తి తెచ్చారో చెప్పాల‌ని నిల‌దీస్తున్నారు.

అంతేకాదు మీరు వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు క‌దా మ‌రి మీరు ఎంబీబీఎస్ చేశారా? అని నిల‌దీస్తున్నారు. దీనికి స‌మాధానం లేదు. అస‌లు వృత్తుల‌ను బ‌ట్టి సంస్థ‌ల‌కు కానీ, వీధుల‌కు కానీ, స్టేడియం లకు కానీ పేర్లు పెట్ట‌రు. వారి పేరు చిర‌స్థాయిగా ప్ర‌జ‌ల్లో గుర్తుండిపోవాల‌నే ఉద్దేశంతోనే అప్ప‌టి ఉన్న ప‌రిస్థితినిబ‌ట్టి ప్ర‌ముఖ‌మైన వాటికినాయ‌కుల పేర్లు పెడ‌తారు. ఈ విష‌యంలో మంత్రి వ్యాఖ్య‌లు వైసీపీ కి బాగానే త‌గిలాయి. ఇక‌, దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్య‌లు కూడా తీవ్రంగానే మారాయి.

త‌న వ్య‌క్తిగ‌తం అంటూనే ఆయ‌న ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. నిజానికి వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌లు చేయాలంటే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి మాట్లాడాల‌ని రాజాకు టీడీపీ నేత‌లు కౌంట‌ర్లు ఇచ్చారు. పైగా ఎన్టీఆర్‌పై ఎవ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని వ్యాఖ్య‌లుచేయ‌డం మ‌రోవైపు పార్టీ అధినేత జ‌గ‌న్ ఆచితూచి వ్య‌వ‌హ‌రించ‌డం వంటివి రాజ‌కీయంగా వైసీపీని ప‌లుచ‌న చేస్తున్నాయ‌ని అంటున్నారు. మ‌రి ఇదేధోర‌ణి సాగితే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.