క‌న్నెర్ర చేస్తే.. యాత్ర‌లు ఆగిపోతాయ్‌: మంత్రి బొత్స

అదే అక్క‌సు.. అవే వ్యాఖ్య‌లు.. రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర‌పై.. వైసీపీ మంత్రుల వైఖ‌రి ఏమాత్రం మార‌డంలేదు. మారేలా కూడా లేదు. తాజాగా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ రైతుల యాత్ర గురించి.. తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కన్నెర్ర చేస్తే చాలు.. 5 నిమిషాల్లో పాదయాత్రలు ఆగిపోతాయని మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదని తెలిపారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే నష్టమేంటన్న బొత్స.. 10 వేల కోట్లు పెడితే ముంబయిని త‌ల‌ద‌న్నే నగరమవుతుందన్నారు.

కాకినాడ నుంచి ఇచ్ఛాపురం వరకు అభివృద్ధి జరగాలన్నారు. ఎన్టీఆర్ రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చాక అన్నం తిన్నామని.. ఇది వాస్తవమని తెలిపారు. వైఎస్‌ జలయజ్ఞంతో తోటపల్లి, వంశధార ప్రాజెక్టులు వచ్చాయని.. ఆ తర్వాత ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గాయని పేర్కొన్నారు. 3 రాజధానులకు అనుకూలంగా సంఘాలన్నీ ర్యాలీ చేయాలని.. ఒక ప్రాంతం, కొందరు వ్యక్తుల కోసం ఆలోచించకూడదని పిలుపునిచ్చారు.

ఇక‌, ఆది నుంచి కూడా మంత్రి బొత్స‌.. రాజ‌ధానిపై ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు. ఇక‌, పాద‌యాత్ర చేస్తున్న వారిపైనా.. ఆయ‌న గ‌తంలో వారంతా పెయిడ్ ఆర్టిస్టులు.. అంటూ.. నోరు పారేసుకున్నారు. బొత్స వ్యాఖ్య‌ల‌పై అప్ప‌ట్లోనే రైతులు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న దిష్టిబొమ్మ‌ను సైతం ద‌హ‌నం చేశారు. అయినా.. బొత్స‌లో ఎక్క‌డా మార్పు క‌నిపించ‌క‌పోగా.. తాజాగా మ‌రింత రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్యానించ‌డంపై రైతులు మ‌రోసారి ఆగ్ర‌హంవ్య‌క్తం చేస్తున్నారు.

న్యాయ‌స్థాన‌మే.. త‌మ‌కు పాద‌యాత్ర చేసుకునే అవ‌కాశం ఇచ్చింద‌న‌.. రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా మంత్రి బొత్స వ్యాఖ్య‌ల‌పై స్పందించిన రైతులు.. తాము ఎవ‌రి ద‌యాదాక్షిణ్యాల‌తో పాద‌యాత్ర చేయ‌డం లేద‌ని.. రాష్ట్ర స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ప‌రిధిలో ఇచ్చిన అనుమ‌తి మేర‌కు చేస్తున్నామ‌ని తెలిపారు. బొత్స చేసిన వ్యాఖ్య‌ల‌పై.. కోర్టును ఆశ్ర‌యించే విష‌యాన్ని న్యాయ నిపుణుల‌తో చ‌ర్చించి.. ప‌రిశీలిస్తామ‌ని.. అమ‌రావ‌తి జేఏసీ నాయ‌కులు తెలిపారు.