అసెంబ్లీ వేదికగా.. సోమవారం.. వైసీపీ అధినేత.. సీఎం జగన్ రెచ్చిపోయారు. ప్రతిపక్ష నాయకులు.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై ఆయన విరుచుకుపడ్డారు. చంద్రబాబు అసలు ఎమ్మెల్యేగా ఉండేందుకు కూడా అర్హత లేని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తారాల సమయంలో సీఎం మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం విషయంలో తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత కూడా మాజీ సీఎం చంద్రబాబుకు లేదన్నారు.
గత ప్రభుత్వ నిర్వాకం వల్లే పోలవరం ఆలస్యం అవుతోందని జగన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కి ఆరున్నర లక్షలు ఇస్తే.. దాన్ని పది లక్షలు చేస్తామని చెప్పామన్నారు. 41.15 అడుగుల నీటిని పోలవరంలో తొలిదశలో నిలబెడతామని, ఆ లెవల్ వరకూ పునరావాసం అందిస్తామన్నారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం వద్ద రూ.2900 కోట్లు మన డబ్బే ఉందన్నారు. పాత లెక్కల ప్రకారం కేంద్రం చెప్పిన లెక్కలకు చంద్రబాబు తలూపారని విమర్శించారు.
గతంలో లక్షన్నర ఇచ్చిన వారికి రూ. 5 లక్షలు ఇస్తామన్నామని.. అంటే ఇంకా మూడున్నర లక్షలు ఇస్తామని చెపుతున్నామని సీఎం జగన్ అన్నారు. కేంద్రం దగ్గర పోలవరం విషయంలో చంద్రబాబు లాలూచీ రాజకీయాలు చేశారని.. అందుకే పోలవరం ప్రాజక్టు ముందుకు సాగడం లేదని విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో చంద్రబాబు నైతికత ఉంటే.. ఎమ్మెల్యే గా కూడా ఆయన కొనసాగేందుకు అర్హత లేదని.. జగన్ వ్యాఖ్యానించారు.
అసెంబ్లీకి రాకుండా.. నాటకాలు ఆడుతున్న చంద్రబాబు.. తన మనుషులతో ఇక్కడ రచ్చ చేయాలని చూస్తున్నారని.. వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండేందుకు అర్హుడు కాదు అధ్యక్షా!
అని పదేపదే జగన్ వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోడియం ముందుకు చేరుకుని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. చేశారు. అయితే.. సందట్లో సడేమియా.. అన్నట్టుగా.. పలు బిల్లులను ఈ గందరగోళం మధ్యే ప్రభుత్వం ఆమోదించుకోవడం గమనార్హం.