ఇక్కడ టీడీపీకి అభ్యర్ధి దొరికినట్లేనా ?

చాలా కాలంగా గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సరైన అభ్యర్ధి లేరు. ఒకపుడు టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గంలో ఇపుడు అసలు అభ్యర్ధే లేరంటే చాలా ఆశ్చర్యంగానే ఉంది. ఇలాంటి నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయం చంద్రబాబునాయుడుకు పెద్ద సమస్యగా మారింది. ఇదే సమయంలో వైసీపీ తరపున మాజీ మంత్రి కొడాలినాని చాలా బలమైన క్యాండిడేట్ గా ఉన్నారు.

గడచిన మూడున్నరేళ్ళుగా కొడాలి తన టార్గెట్ మొత్తాన్ని చంద్రబాబు, లోకేష్ మీదే పెట్టిన సంగతి అందరు చూస్తున్నదే. ఒకవిధంగా చంద్రబాబుకు కొడాలి చాలా పెద్ద సమస్యగా మారారు. అందుకనే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కొడాలిని ఓడించటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. టార్గెట్ అయితే పెట్టుకున్నారు కానీ దాన్ని ఎలా సాధించాలో అర్ధం కావటంలేదు. ఎందుకంటే కొడాలిని ఢీకొనేంత సీన్ ఉన్న నేతలు లేరు.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును గుడివాడలో పోటీచేయించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. ఈమధ్య కృష్ణాజిల్లాలోని నేతలతో చంద్రబాబు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ సందర్భంగా గుడివాడ విషయం చర్చకు వచ్చిందట. అప్పుడు మెజారిటి నేతలు వచ్చే ఎన్నికల్లో దేవినేనిని పోటీచేయించాలని చెప్పారట. దేవినేని మాత్రమే కొడాలికి సరైన నేతని కాబట్టి గుడివాడలో ఈ మాజీమంత్రిని పోటీచేయిస్తే బాగుంటుందని చెప్పారట. దానికి చంద్రబాబు కూడా సానుకూలంగానే స్పందించారని సమాచారం.

దేవినేని మొన్నటి ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు. అలాంటిది వచ్చేఎన్నికల్లో మైలవరంలో కాకుండా గుడివాడలో పోటీచేయటమంటే మామూలు విషయంకాదు. నేతలు సూచించారు సరే మరి దేవినేని ఆలోచన ఎలాగుందో తెలీదు. ఎందుకంటే గుడివాడలో దేవినేనికి ఏపాటి బలముందో తెలీదు. పార్టీ మద్దతు దొరుకుతుందని అనుకున్నా అదిపెద్దగా ఉండే అవకాశంలేదు. మరీ నేపధ్యంలో దేవినేని గుడివాడలో పోటీచేయటానికి రెడీ అంటారా ?