విమోచ‌నమా.. స‌మైక్య‌తా.. తెలంగాణలో స‌రికొత్త పోరు!

తెలంగాణ‌లో మ‌రోస‌రికొత్త వివాదం..తెర‌మీదికి వ‌చ్చింది. సెప్టెంబ‌రు 17, తెలంగాణ ప్రాంతం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యవ్యవస్థలోకి వచ్చిన రోజు. ఇది రేప‌టికి 75వ వసంతంలోకి అడుగు పెడుతోంది. దీనిని పుర‌స్క‌రించుకుని.. స‌ర్కారు-గ‌వ‌ర్న‌ర్ భ‌వ‌నాలు.. రెండుగా చీలిపోయాయి. ప్ర‌భుత్వం ఈ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని.. స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వాలు నిర్వ‌హిస్తోంది. అయితే.. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై మాత్రం దీనిని విమోచ‌నా దినోత్స‌వంగానే నిర్వ‌హించాల‌ని నిర్ణయించారు.

ఇప్ప‌టికే ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయి. దీంతో ఈ ప‌రిణామాలు.. అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ్‌భ‌వ‌న్‌కు మ‌ధ్య మ‌రింత వివాదాన్ని రేపింద‌ని అంటున్నారు పరిశీల‌కులు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరిట ఏడాదిపాటు ఘనంగా వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు వజ్రోత్సవ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి.

ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించనున్నా రు. విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలను ఇందులో భాగస్వామ్యం చేస్తారు. తెలంగాణ చరిత్రలో ఎంతో చారిత్రకతను సొంతం చేసుకున్న సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేస‌మ‌యంలో విమోచ‌న దినోత్స‌వంలో భాగంగా రాజ్‌భ‌వ‌న్ లో మేధావుల స‌ద‌స్సును గ‌వ‌ర్న‌ర్ ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక‌, శ‌నివారం.. హైదరాబాద్‌లో బంజారా, ఆదివాసీ భవన్‌లను సీఎం కేసీఆర్‌ జాతికి అంకితం చేస్తారు. ఈ సందర్భంగా పీపుల్స్ ప్లాజా నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు గిరిజన కళారూపాలతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం స్టేడియంలో జరిగే బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ప్రారంభ వేడుకల్లో మూడో రోజైన ఈనెల 18న జాతీయ సమైక్యత, సమగ్రతను చాటేలా అన్ని జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వాతంత్ర సమరయోధులను సన్మానిస్తారు. కవులు, కళాకారులను గుర్తించి సత్కరిస్తారు.

షా రాక‌..

మ‌రోవైపు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ విమోచన అమృతోత్సవాలను విజయవంతం చేసేందుకు… కేంద్ర పర్యాటక శాఖ ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈ రోజు హైద‌రాబాద్‌కు రానున్నారు. శనివారం ఉదయం పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే విమోచన అమృతోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో ప‌రిస్థితి గుంభ‌నంగా మారిపోయింది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో న‌న్న టెన్ష‌న్ వాతావ‌ర‌ణం కూడా నెల‌కొన‌డం గ‌మ‌నార్హం.