చిన్న‌బోతున్న చిన్న‌మ్మ‌.. ఆశ‌లు తీర‌వా?

పొలిటిక‌ల్‌గా ఎంత దూకుడు పెంచినా.. ఏం చేసినా.. కోరుకున్న యోగం కోసమే క‌దా! నాయ‌కుల వ్య‌వ‌హా రం ఎప్పుడూ కూడా.. ఏదో ఒక‌టి ఆశించే ఉంటుంది. అలానే.. గ‌తంలో వైఎస్ ఆశీర్వాదంతో(తెర‌చాటున‌) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న అన్న‌గారి కుమార్తె.. ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి.. ఉర‌ఫ్ చిన్న‌మ్మ కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. వ‌చ్చీ రాగానే.. ఆమె విశాఖ నుంచి గెలుపు గుర్రం ఎక్క‌డం.. ఆవెంట‌నే అతి పెద్ద కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా చ‌క్రం తిప్ప‌డం తెలిసిందే.

క‌ట్ చేస్తే.. రాష్ట్ర విభ‌జ‌న ముప్పు ప్ర‌జ‌ల‌కు ఎలా ఉందో తెలియ‌దు కానీ.. రాజ‌కీయ నేత‌ల‌పై మాత్రం బాగా నే ప‌డింది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన పురందేశ్వ‌రి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో రాజంపేట నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ ఇదే ప‌రాభ‌వం ఎదురొచ్చింది. దీంతో పురందేశ్వ‌రి.. మౌనంగానే ఉన్నారు. మ‌రోవైపు.. రాష్ట్రంలో ఉన్న నాయ‌కుల‌తో చెలిమిలేదనే మాట వాస్త‌వం.

మొత్తంగా అనేక ఎదురు చూపుల త‌ర్వాత‌.. బీజేపీ కొంత మేర‌కు గుర్తించింది. ఈ క్ర‌మంలోనే కేంద్ర పార్టీ లో ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టింది. ఒరిస్సా, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో బీజేపి ప‌రిశీల‌క ఇంచార్జ్ గా నియ‌మించారు. అదేవిధంగా పార్టీలో చేరిక‌ల క‌మిటీలో పురందేశ్వ‌రికి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇవి నిజంగానే కీల‌క ప‌ద‌వులు. అయితే.. ఏం జ‌రిగిందో ఏమో.. తెలియ‌దు కానీ.. పార్టీ అధిష్టానం.. ఇటీవ‌ల ఒరిస్సా,ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప‌ద‌వుల నుంచి పురందేశ్వ‌రిని త‌ప్పించింది. దీంతో ఖంగుతిన్న పురందేశ్వ‌రి.. కొన్నాళ్ల‌పాటు మీడియాకు ముఖం చాటేశారు.

ఇక‌, ప్ర‌స్తుతం ఆమె..కేవ‌లం.. చేరిక‌ల క‌మిటీ బాధ్యురాలిగా మాత్ర‌మే ఉన్నారు. ఇదిలావుంటే… వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి పోటీ చేయాల‌ని.. గెలిచి.. కేంద్రంలో మంత్రిపీఠాన్ని ద‌క్కించుకోవాల‌నేది.. పురందేశ్వ‌రి ఆకాంక్ష‌. అయితే.. ఆమెకోరుకున్న‌ట్టుగా.. విశాఖ టికెట్ ఇచ్చే ప‌రిస్థితి లేదని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోం ది. ఇక్క‌డ నుంచి ఒక కీల‌క నేత టికెట్ ఆశిస్తున్నారు. గ‌తంలో కూడా ప్ర‌య‌త్నించినా.. ఆయ‌న‌కు సాకారం కాక‌పోవ‌డంతో ఇప్పుడు మాత్రం గ‌ట్టిగానే టికెట్ కోసం.. ఓ కీల‌క నాయ‌కుడితో సిఫార‌సు చేయిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ ప‌రిణామాల‌తో చిన్న‌మ్మ‌కు ఆశ‌లు నెర‌వేరే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సీటే ద‌క్క‌క‌పోతే.. ఆమె గెలిచేదెలా.. ఇక‌, మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కించుకునేదెలా? అని అంటున్నారు ప‌రిశీల‌కులు.