టార్గెట్ ఈట‌ల‌.. స‌స్పెన్ష‌న్‌- అరెస్టు- విడుద‌ల‌!!

బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ టార్గెట్‌గా తాజా ప‌రిణామాలు జోరందుకున్నాయి. అసెంబ్లీ స‌మావేశాలకు సోమ‌వారం డుమ్మా కొట్టిన రాజేంద‌ర్‌.. మంగ‌ళ‌వారం హాజ‌ర‌య్యారు. అయితే.. ఆయ‌న ఎప్పుడు వ‌స్తాడా? అని ఎదురు చూసిన అధికారపార్టీ నేత‌లు.. ఆయ‌న స‌భ‌లో క‌నిపించ‌గానే.. స్పీక‌ర్‌కు ఆయ‌న‌పై నోటీసులు ఇచ్చారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి ని ‘మరమనిషి’ అని వ్యాఖ్యానించిన నేప‌థ్యంలో దీనిపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కోరారు.

సభాపతిపై చేసిన వ్యాఖ్యలపై ఈటల… బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్‌ సభలో ఉండి చర్చ సాగించాలని తాము కోరుకుంటున్నామన్నారు. దీనిపై ఈటల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప‌రిణామాల క్ర‌మంలో స్పీక‌ర్ పోచారం వెంట‌నే ఈటల రాజేందర్‌‌ పై సస్పెన్షన్ వేటు వేశారు. ప్ర‌స్తుత స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు ఆయ‌న‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ క్రమంలో సభ నుంచి బయటకు వచ్చిన ఈటలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే ఈటలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, త‌న‌ అరెస్ట్‌‌పై ఈటల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

పోలీస్ వాహనంలో ఎక్కేందుకు ఈటల వ్యతిరేకించగా… బలవంతంగా ఆయనను పోలీస్‌ వాహనంలో తరలించారు. తన సొంత వాహనంలో బయటకు వెళతానని బీజేపీ ఎమ్మెల్యే చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. ఈ క్రమంలో అసెంబ్లీ వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. శాసనసభ నుంచి ఈటల రాజేందర్‌ను పోలీసులు శామీర్‌పేట్‌లోని తన నివాసానికి తరలించి, అక్క‌డ వ‌దిలి పెట్టారు.

కాగా, పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బానిసలా వ్యవహరించవద్దంటూ పోలీసులపై మండిపడ్డారు. “మీ నాశనానికే ఇదంతా చేస్తున్నారు. సంవత్సర కాలంగా కుట్ర చేస్తున్నారు. గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు అసెంబ్లీకి హాజరుకాకుండా చేస్తున్నారు. గొంతు నొక్కుతున్నారు. గద్దె దించే వరకు విశ్రమించను. మీ తాటాకు చప్పుళ్లకు భయపడను” అంటూ ఈటల రాజేందర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.