ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. మోడీకి అధికార మదం నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీకి ఎప్పుడూ 50 శాతం ఓట్లు రాలేదని తెలిపారు. రాష్ట్రాల విషయంలో మోడీ వ్యవహరిస్తున్న తీరును చూసి ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు ఎంతో బాధపడుతున్నారని చెప్పారు. ఇప్పటివరకు 11 రాష్ట్రాలను కూలగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఎవరూ.. మాట్లాడకూడదు. ఏదీ ప్రశ్నించకూడదు.. అన్నట్టుగా మోడీ వ్యవహరిస్తున్నారని.. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేంద్రంలో 8 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్క మంచిపని చేసిందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు తమ బలం ఏంటో చెబుతారని హెచ్చరించారు. యువత గుండెల్లో రగిలే మంటలు ఆపగలరా? అని నిలదీశారు. “తెలంగాణలో 3 తోకలున్నాయి.. మమ్మల్ని పడగొడతామని అంటున్నారు. ప్రధాని, కేంద్రమంత్రుల అవివేక చర్యలతో దేశం ప్రమాదంలో పడింది. రైతుల భూములను కబళించేందుకు కుట్రలు జరుగుతున్నాయి.” అని వ్యాఖ్యానించారు.
కాగా, ఐదు రోజుల విరామం తర్వాత తెలంగాణ శాసనసభ సమావేశమైంది. ఏడు బిల్లులను సర్కారు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ… పురపాలక నిబంధనల చట్ట సవరణపై బిల్లులను మంత్రి కేటీఆర్… పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ పదవీవిరమణ నియంత్రణ చట్ట సవరణ బిల్లును వైద్యారోగ్య, ఆర్ధికశాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. జీఎస్టీ చట్టసవరణ బిల్లును మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రవేశ పెట్టారు.
అటవీ వర్సిటీ బిల్లును ఇంద్రకరణ్ రెడ్డి.. వర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు బిల్లును విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, మోటారు వాహనాల పన్ను చట్ట సవరణ బిల్లును పువ్వాడ అజయ్… శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లులుపై రేపు చర్చచేపట్టనున్నట్లు స్పీకర్ వెల్లడించారు. అంతకుముందు పాలేరు మాజీ ఎమ్మెల్యే, దివంగత భీమపాక భూపతిరావుకు అసెంబ్లీ సంతాపం ప్రకటించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates