నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై అన్నివైపుల నుం చి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు.. కేవలం ప్రభుత్వ విధానాలపైనే విమర్శలు గుప్పిం చిన వారు.. తాజాగా ప్రభుత్వాధినేతపైనా.. నిప్పులు చెరుగుతున్నారు. ఉద్దేశ పూర్వకంగానే అమరావతిని తొక్కేస్తున్నారని.. ఇది కోర్టులతో ఆడుకునే పరిణామంగానే చూడాల్సి ఉంటుందని.. సుప్రీం కోర్టు రిడైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ఈ వ్యవహారంలో హైకోర్టు కూడా బలంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. న్యాయ మూర్తులు ధైర్యంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా వ్యవహరి స్తోందన్న ఆయన.. రాజధానిపై హైకోర్టు తీర్పు అమలు చేయకుండా ఉండటానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తోందని చెప్పారు. కోర్టు ధిక్కరణ కిందకే ఈ వ్యవహారం వస్తుందని పేర్కొన్ మాజీ జస్టిస్.. ముఖ్యమంత్రి సహా బాధ్యులందరికీ సమన్లు జారీ చేసి కోర్టుకు పిలిపించాలన్నారు.
కోర్టు తీర్పును ఉల్లంఘించినందుకు, అబద్ధాలు చెబుతున్నందుకు వారందర్నీ జైలుకి పంపాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రికి సైతం వారెంట్ ఇవ్వాలని.. ఒకవేళ ఇలా ఇచ్చేందుకు పోలీసులు ముందుకు రాకపోతే ఈ-మెయిల్, వాట్సప్‌ల ద్వారా పంపాలని సూచించారు. అవసరమైతే.. కోర్టు కేంద్ర సాయుధ బలగాలైన సీఆర్‌పీఎఫ్ సహకారం తీసుకోవాలని సూచించారు.
అమరావతి కేసుల్లో హైకోర్టు అన్ని అంశాల్నీ కూలంకషంగా పరిశీలించి నిర్దిష్టమైన తీర్పు చెప్పిందన్న జస్టిస్ గౌడ సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేయడం కుదరదని, మూడు రాజధానులపై చట్టం చేసే అధికార పరిధి శాసనసభకు లేదని స్పష్టం చేసిన విషయాలను మరోసారి వెలువరించారు. హైకోర్టు తీర్పు చెప్పి ఆరు నెలలైపోయిందని.. అయినా.. దీనిపై సుప్రీంకోర్టు స్టే లేనప్పుడు హైకోర్టు తీర్పే అమల్లో ఉంటుందని అన్నారు. ప్రభుత్వం దాన్ని అమలు చేయకపోవడం ముమ్మాటికీ కోర్టును ఉద్దేశపూర్వకంగా ధిక్కరించడమే అవుతుందని తేల్చి చెప్పారు.
ఇలాంటి సమయంలో తానే కనుక ఈ కేసును విచారిస్తుంటే.. ముఖ్యమంత్రి ఎవరైనా.. సరే.. వెంటనే జైలుకు పంపించి ఉండేవాడినని జస్టిస్ గౌడ చెప్పారు. ఇక, నిధుల విషయాన్ని కూడా ప్రస్తావించారు. రాజధాని నిర్మాణానికి నిధుల్లేవని ప్రభుత్వం తప్పించుకుందామనుకుంటే కుదరదని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం మున్సిపాలిటీ కేసులో 1980లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పు అమరావతికీ వర్తిస్తుందన్నారు.
రత్లాం మున్సిపాలిటీలో మురుగు కాల్వలు పొంగిపొర్లుతున్నా పాలకమండలి పట్టించుకోవడం లేదని కొందరు కోర్టుకు వెళ్లారని, వసతుల కల్పనకు డబ్బుల్లేవని మున్సిపాలిటీ చెబితే.. అలా అని తప్పించుకోలేరని, అవసరమైతే రాష్ట్ర బడ్జెట్ నుంచే నిధులు కేటాయించాలని జస్టిస్ కృష్ణయ్యర్ స్పష్టం చేసిన విషయాన్ని జస్టిస్ గౌడ గుర్తు చేశారు. అలాగే అమరావతి నిర్మాణం కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతని స్పష్టం చేశారు. సీఆర్డీఏ దగ్గర డబ్బుల్లేవని, రుణం కోసం బ్యాంకుల్ని అడుగుతున్నామని తాత్సారం చేస్తే కుదరదన్నారు.
మూడు రాజధానులు వృథా!
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని విపక్ష నేతగా జగన్ ఆమోదించిన విషయాన్ని జస్టిస్ గౌడ గుర్తు చేశారు. ఏ ప్రభుత్వమైనా విస్తృత ప్రజాప్రయోజనాలున్నాయి అనుకున్నప్పుడే గత ప్రభుత్వ విధానాల్లో మార్పులు చేయాలని సూచించారు. మూడు రాజధానుల్లో ప్రజా ప్రయోజనం గానీ రాష్ట్ర ప్రయోజనం గానీ లేకపోగా.. అది ప్రజల, రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. లేఅవుట్ ప్లాన్‌నే మార్చడానికి వీల్లేనప్పుడు, రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను ఎలా మార్చేస్తారని ఆయన ప్రశ్నించారు.