మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 3 రాజధానుల బిల్లును మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు. సీఎం జగన్ ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పాలన ప్రారంభించవచ్చని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే.. చంద్రబాబు అమరావతి రైతులను రెచ్చగొడుతున్నారని అమర్నాథ్ ఆరోపించారు. మూడు రాజధానులకు సంబంధించిన స్పష్టమైన బిల్లును అసెంబ్లీలో మళ్లీ ప్రవేశపెడతామని ఆయన తెలియజేశారు. గతంలో రాజధానిపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును సవరించి.. కొత్త బిల్లు పెట్టాలనే ఆలోచన చేశామని అన్నారు.
అయితే కొవిడ్ కారణంగా ఇది కొంత ఆలస్యం అయిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పాలన ఆరంభించవచ్చని అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సీఎం జగన్ అడుగులు ముందుకు వేస్తుంటే.. దానిని అడ్డుకునేందుకు చంద్రబాబు అమరావతి ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి అమరావతి నుంచి అరసవెల్లి యాత్రకు ఉసిగొల్పారని విమర్శించారు. ఈ యాత్రను ఉత్తరాంధ్ర ప్రజలపై చేస్తున్న దండయాత్రగా భావిస్తున్నామని అమర్నాథ్ అన్నారు.
అమరావతిలో జరిగిన పుస్తకావిష్కరణ సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా ఇతర పార్టీ నేతలు సీఎం జగన్ గురించి చులకనగా, అవహేళనగా మాట్లాడటం సరికాదని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఈ సభలో చంద్రబాబుతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు చేసిన వ్యాఖ్యలు వింటే వారు కూడా విశాఖ ప్రాంత వ్యతిరేకులుగా భావించాల్సి వస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని, అభివృద్ధి అనేది అంతటా జరగాలని ఆలోచించి మూడు రాజధానుల ప్రకటన చేస్తే, దానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వైసీపీ మినహా ఇతర రాజకీయ పార్టీల నేతలు వ్యతిరేకించడం అన్యాయమన్నారు.
అమరావతిలోని 29 గ్రామాలు మాత్రమే అభివృద్ధి చెందాలని, రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదన్న భావనతోనే ఈ సభను ఏర్పాటు చేసినట్లు అర్థం అవుతోందని దుయ్యబట్టారు. అమరావతి వద్దు అని చెప్పలేదని అమరావతిని కూడా కలుపుకొని 3 రాజధానులు చేసి చూపిస్తామని అందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అమర్నాథ్ స్పష్టం చేశారు.