ఆంధ్రా ‘త‌మిళిసై’ ఎక్క‌డ‌?

ఇది కొంత చిత్ర‌మైన విష‌యం. త‌ర‌చుగా చ‌ర్చ‌కు కూడా వ‌స్తున్న విష‌య‌మే! దేశ‌వ్యాప్తంగా బీజేపీ యేత‌ర ప్ర‌భుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్లు.. దూకుడుగా ఉన్నారు. అంతేకాదు.. అక్క‌డి ప్ర‌భుత్వాల‌కు చుక్క‌లు చూపిస్తున్నార‌నే చెప్పాలి. ఉదాహ‌ర‌ణ‌కు.. ఢిల్లీని తీసుకుంటే.. అక్క‌డి ప్ర‌భుత్వాన్ని ముప్పు తిప్పులు పెడుతున్నారు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనా. ఇటీవ‌ల కేజ్రీవాల్ స‌ర్కారును డిఫెన్స్‌లో ప‌డేసిన‌.. లిక్క‌ర్ కుంభ కోణాన్ని గ‌వ‌ర్న‌ర్ స్వ‌యంగా సీబీఐకి అప్ప‌గించారు.

అంతేకాదు.. ఇక్క‌డి మ‌హ‌ల్లా ఆసుప‌త్రులు, విద్యాల‌యాల నిర్మాణాల్లోనూ అవినీతి జ‌రిగింద‌ని.. తాజాగా ఆయ‌న స‌ర్కారుపై విచార‌ణ‌కు ఆదేశించారు. ఇలా.. ఢిల్లీ ప్ర‌భుత్వాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్నార‌న‌డంలో సందేహం లేదు. ఇక‌, త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ ఆర్ .ఎన్ . ర‌వి కూడా ఇలానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌ను పంపుతున్న బిల్లుల‌ను ఆయ‌న తొక్కి పెడుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. దీనిపై స్టాలిన్ ప్ర‌బుత్వం గుస్సాగా ఉంది.

ఇక‌,ప‌శ్చిమ బెంగాల్‌లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌స్తుత ఉప‌రాష్ట్ర‌ప‌తి.. జ‌గదీప్ ధ‌న్‌క‌డ్ గురించి ఎంత చెప్పుకొన్నా.. త‌క్కువే. ఫైర్ బ్రాండ్ సీఎంగా పేరు తెచ్చుకున్న మ‌మ‌త‌కు ఆయ‌న చుక్క‌లు చూపించారు. నిత్యం మ‌మ‌త ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేశార‌నే చెప్పాలి. ఇక‌, తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌కు అక్క‌డి సీఎం కేసీఆర్ కు మ‌ధ్య ఇటీవ‌ల కాలంలో ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి త‌లెత్తింది. తాజాగా మూడేళ్లు పూర్తి చేసుకున్న త‌మిళి సై.. ప్ర‌భుత్వంపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.

గ‌తంలోనూ ఆమె.. కేసీఆర్ స‌ర్కారుపై కేంద్రానికి.. ఫిర్యాదులు మోశారు. మ‌రి.. ఇలా..బీజేపీయేతర ప్ర‌భుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్లు ఇంత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుంటే.. మ‌రి ఏపీలో ఉన్న గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ఏం చేస్తున్నారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఈయ‌న కూడా ఆర్ ఎస్ ఎస్ భావాలు పుణికి పుచ్చుకున్న నాయ‌కుడే. అంతేకాదు.. బీజేపీ నాయ‌కుడు కూడా. అయితే.. ఆ త‌ర‌హా .. దూకుడు మాత్రం ఆయ‌న చూపించ‌లేక పోవ‌డం గ‌మ‌నార్హం.

రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో త‌మ‌కు అన్యాయం చేస్తున్నార‌ని.. రైతులు వ‌చ్చి గ‌గ్గోలు పెట్టినా.. ఆయన నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌భుత్వం.. స‌ల‌హాదారుల‌ను నియ‌మిస్తూ.. ప్ర‌జాధ‌నాన్ని వృథా చేస్తోంద‌ని.. హైకోర్టు విమ‌ర్శ‌లు గుప్పించినా.. గ‌వ‌ర్న‌ర్ ఏమీ ప‌ట్టించుకోలేదు. ఎస్సీ, ఎస్టీల‌పై దాడులు చేస్తున్నార‌ని.. వారిని నిలువ‌రించాల‌ని.. అనేక విజ్ఞాప‌న‌లు వ‌చ్చినా.. గ‌వ‌ర్న‌ర్ ప‌ట్టించుకోలేదు. ఇక‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు లేఖ‌లు రాస్తున్నా.. వాటిపై వివ‌ర‌ణ‌లు తీసుకోవ‌డం లేదు.

ఇవ‌న్నీ ఇలా.. ఉంటే.. అప్పులు చేసే విష‌యంలో ఏకంగా గ‌వ‌ర్న‌ర్ పేరును ఇరికించింది… వైసీపీ ప్ర‌భుత్వం. దీనిపై పెద్ద ఎత్తున ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పించాయి. అయితే.. గ‌వ‌ర్న‌ర్ మాత్రం స్పందించ‌లేదు. అరె.. నా పేరు ఎలా వినియోగిస్తారు? అని మాట మాత్రంగా కూడా ఆయ‌న అడ‌గ‌లేదు. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌తో ప్ర‌బుత్వం దిగివ‌చ్చింది. ఇక‌, లెక్కకు మిక్కిలి అప్పులు చేస్తున్నార‌ని.. కేంద్రం నుంచి ఆర్బీఐ నుంచి ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. నిధుల దుర్వినియోగంపై.. నిప్పులు చెరుగుతున్నా.. ప్ర‌భుత్వ బాధ్యుడిగా గ‌వ‌ర్న‌ర్ హ‌రిచంద‌న్ స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇలా.. చెప్పుకొంటూ.. పోతే చాలానే ఉన్నాయి. మ‌రి ఇత‌ర రాష్ట్రాల్లో ఉన్న దూకుడు ఏపీలో లేక పోవ‌డం ఏంట‌నేది.. చిత్ర‌మే క‌దా!!