వచ్చే ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ ఎంతో తెలుసా ?

వచ్చే ఎన్నికల్లో గెలిచి మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే రోడ్ మ్యాప్ తయారు చేయడం కోసం ఢిల్లీలో ముఖ్యనేతలతో మేథోమథనం జరిగింది. జేపీ నడ్డాతో పాటు కొందరు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలతో జరిగిన సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 144 ఎంపీ సీట్లను గెలుచుకోవాలనేది టార్గెట్ గా పెట్టుకున్నారు.

144 ఎంపీ సీట్లంటే ఇప్పటివరకు గెలవని స్ధానాలను గెలవాలన్నది టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పుడు ఎన్డీయేలో బీజేపీకి సొంతంగా 305 ఎంపీ సీట్లున్నాయి. ఈ సీట్లను గెలుచుకుంటూనే అదనంగా 144 సీట్లను గెలవాలని అమిత్ షా చెప్పారు. ఈ 144 సీట్ల లెక్కేమిటంటే పోయిన ఎన్నికల్లో రెండు, మూడు స్ధానాల్లో నిలిచిన స్ధానాలట. పోయిన ఎన్నికల్లో ఓడిపోయిన సీట్లను వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్నది ఇపుడు పెట్టుకున్న టార్గెట్.

ఈ సీట్లు కూడా తెలంగాణా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్ లోనే గెలవటానికి ఎక్కువగా అవకాశాలున్నాయని సమావేశం గుర్తించింది. ఈ 144 సీట్లలో గెలుపు అవకాశాలు పెంచుకునేందుకు వీలుగా కేంద్రమంత్రులు, ఎంపీలను ఇన్చార్జిలుగా నియమించాలని డిసైడ్ చేశారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు స్ధానిక నాయకత్వంతో కలిసి లెక్కలన్నీ తీయాలని డిసైడ్ చేశారు. బీజేపీ గుర్తించిన ఎంపీ సీట్లలో సామాజిక వర్గం లెక్కలు, ఏ పార్టీకి ఎన్ని ఓట్లుంటాయనే అంచనాలతో సర్వేలు నిర్వహించాలని డిసైడ్ చేశారు.

బీజేపీ వరస చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో గెలుపుకు ఇప్పటినుండే పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లే ఉంది. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉండటం, కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉండటం కూడా ఓట్ల చీలిక జరిగి బీజేపీకి అడ్వాంటేజ్ గా మారబోతోంది. పైగా అసమ్మతి పెద్దగా లేకపోవటం, నరేంద్రమోడీ లాంటి బలమైన ఏక నాయకత్వం ఉండటం బీజేపీకి ప్రస్తుతానికి బాగా కలిసొస్తోంది. మరి తన టార్గెట్ ను బీజేపీ ఎంతవరకు రీచవుతుందో చూడాలి.