తుమ్మల నాగేశ్వరరావు. బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయనకు ఒకప్పుడు తిరుగులేదు. కానీ, ఓడలు బళ్లు అయినట్టుగా.. ఆయన పరిస్థితి ఇప్పుడు సందిగ్ధావస్థలో పడిపోయింది. ఉన్న పార్టీ పట్టించుకోవడం లేదు. వెళ్దామనుకునే పార్టీల్లో సత్తాపై.. ఆయనకు ధైర్యం లేదు. దీంతో ఇప్పుడు ఆయన డోలాయమాన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఆది నుంచి టీడీపీతో అనుబంధం ఉన్న తుమ్మల.. 2014 తర్వాత.. అనూహ్యంగా టీఆర్ఎస్ పంచన చేరారు.
ఈ క్రమంలోనే ఆయనను ఉప ఎన్నికల బరిలో నిలబెట్టి గెలిపించుకున్న కేసీఆర్.. తర్వాత మంత్రి పదవిని కూడా ఇచ్చారు. ఈ క్రమంలో ఒకింత అలుపెరుగకుండా పనిచేసిన తుమ్మల.. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించిన రామదాసు ప్రాజెక్టును పూర్తి చేసి.. ఆయన దగ్గర మార్కులు సంపాయించుకున్నారు. అయితే.. ఇదే సమయంలో మంత్రి కేటీఆర్‌కు ఆయనకు మధ్య గ్యాప్ పెరిగింది. మరోవైపు.. 2018 ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా.. ఆయన పార్టీపై నమ్మకంతోనే ఉన్నారు.
కానీ, పాలేరు నుంచి గెలిచిన ఉపేందర్‌రెడ్డి కాంగ్రెస్ కాడి పడేసి.. కేటీఆర్ ప్రోత్సాహంతో కారెక్కేయడం.. తుమ్మల రాజకీయాలకు చెక్ పడినట్టు అయిందనే వాదన ఉంది. ఇక, అప్పటి నుంచి ప్రగతి భవన్‌లోకి ఎంట్రీ ఇవ్వడం మానేశారు. అంతేకాదు.. గతంలో కేసీఆర్ పర్యటనల సమయంలో ప్రత్యేక ఆహ్వానం అందుకున్న తుమ్మల.. ఇప్పుడు అది కూడా లేక.. ఈసురోమంటున్న పరిస్థితి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన కొన్నాళ్లు వ్యవసాయం చేసుకుంటానని చెప్పి.. అదే పనిచేశారు.
అయితే.. ఎంతైనా.. రాజకీయాలకు అలవాటు పడ్డ ప్రాణం కావడంతో వచ్చే ఎన్నికల్లో అయినా.. పోటీ చేసి విజయం దక్కించుకోవాలని భావిస్తున్నారు. కానీ, పాలేరు నుంచి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పోటీకి సిద్ధపడడంతో టీఆర్ఎస్ వ్యూహం మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ నుంచి తుమ్మలకు అవకాశం ఇస్తే.. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని.. తద్వారా.. సీటు పోగొట్టుకోవడం ఖాయమని అంచనాలకు వచ్చింది. దీంతో తుమ్మలకు ఛాన్స్ మిస్ ఖాయమని అంటున్నారు.
ఈ పరిణామాలను ముందుగానే గ్రహించిన తుమ్మల.. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేందుకు అడుగులు వేస్తున్నారు. అయితే.. ఏ పార్టీలో చేరాలనే విషయంపై ఆయన తర్జన భర్జన పడుతున్నారు. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ రెండూ.. తుమ్మల వస్తే.. చేర్చుకునేందుకు రెడీ అయినా.. ఈ రెండు పార్టీలు అధికారంలోకి వస్తాయో.. రావో.. అనే బెంగ కూడా వెంటాడుతోందని అంటున్నారు. అంతేకాదు.. ఇప్పటి వరకు ఉన్న తన అనుచరుల మనోగతం ప్రకారం.. ఆయన టీఆర్ఎస్‌లో ఉండడమే మంచిదని అంటున్నారు. ఈ పరిణామాలతో తుమ్మల పరిస్థితి ఆ గట్టా.. ఈ గట్టా తేల్చుకోలేని పరిస్థితిలో ఉందని అంటున్నారు.