తెలంగాణలో శుక్రవారం నాడు కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. నిన్న ఒక్కరోజే 1,892 కేసులు నమోదు కాగా…వాటిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1,658 కేసులు ఉండడం కలవరపెడుతోంది. మొత్తం 5,965 మందికి పరీక్షలు చేయగా 4,073 మందికి నెగటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 20 వేల మార్కును దాటింది. మరోవైపు, శుక్రవారం నాడు జరిపిన మరో 3 వేలకు పైగా టెస్టులు పెండింగ్ లో ఉన్నాయి. ఒకే ప్రైవేటు ల్యాబులో 3,726 మందికి టెస్ట్ చేస్తే.. 2,672 మందికి రావడంతో వైద్యాధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ ల్యాబులో పాజిటివ్ రేట్ ఎక్కువగా ఉన్నందున.. టెస్టుల్లో తప్పులు ఏమైనా జరిగాయేమో చూసిన తర్వాతే కేసుల సంఖ్య ప్రకటిస్తామని అధికారులు అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదలపై తెలంగాణ వైద్య విద్యా శాఖ డైరెక్టర్ కె.రమేష్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం వైరస్ ను సృష్టించలేదని, ప్రజలు కరోనాబారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరోనా కేసులు, టెస్టుల సంఖ్యను ప్రభుత్వం దాచిపెట్టడం లేదని, కేసుల విషయంలో అమెరికాతో పోలిస్తే తెలంగాణ నయమని అన్నారు.ముంబై, చెన్నై తరహాలోనే హైదరాబాద్ వంటి మహానగరంలో అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడం సహజమని రమేష్ రెడ్డి అన్నారు. గాంధీ ఆసుపత్రిలో 625 మంది సిబ్బందిని నియమించాల్సి ఉందని, టిమ్స్ లో రిక్రూట్ మెంట్ పూర్తి కావచ్చిందని అన్నారు. 13 ప్ర్రైవేటు ల్యాబుల్లో టెస్టుల సంఖ్యలో తేడాలను గుర్తించామని వెల్లడించారు. తెలంగాణలోని ప్రైవేటు ల్యాబులు రోజుకు 8 వేల టెస్టులు, ప్రభుత్వాసుపత్రులు, ల్యాబుల్లో రోజుకు 6.5 వేల టెస్టులు నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని అన్నారు. 23 ప్రైవేటు ల్యాబులకు కరోనా టెస్టులు చేసేందుకు అనుమతినిచ్చామని చెప్పారు. 50 వేల టెస్టుల టార్గెట్ ను చేరుకున్నామని, జూన్ నెలలో 13534 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.
ఓ వైపు కరోనా టెస్టుల సంఖ్య విషయంలో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి…మరో వైపు ప్రైవేటు ల్యాబుల్లో పాజిటివ్ వ్యక్తులకు సంబంధించిన డేటా సరిగా లేదని ఆరోపణలు వస్తు్నాయి. ఇటువంటి నేపథ్యంలో కరోనాను ప్రభుత్వం క్రియేట్ చేయలేదని…ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రమేష్ రెడ్డి చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. టెస్టుల సంఖ్య పెంచడంలో నిర్లక్ష్యం, లక్షణాలు లేని కేసులకు పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని చెప్పడం, ప్ర్రైవేటు ల్యాబుల్లో పాజిటివ్ వచ్చిన వారి వివరాలను తెప్పించుకోవడంలో విఫలమవడం…ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనాలని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని…కానీ, ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే ఈరోజు హైదరాబాద్ లో కేసులు విపరీతంగా పెరిగి…ఆసుపత్రుల బయట పాజిటివ్ వచ్చిన వారు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు.