స‌ల‌హాదారుదే కీల‌క పాత్ర‌.. బొత్స మౌనం

వైసీపీ ప్ర‌భుత్వంలో స‌ల‌హాదారుల‌కు ఉన్న విల‌వ మంత్రుల‌కు లేకుండా పోతోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. సీనియ‌ర్ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. రెండు సార్లు జ‌రిగిన కేబినెట్ ఏర్పాటులో.. జ‌గ‌న్ ఆయ‌నకు రెండోసారి కూడా అవ‌కాశం ఇచ్చారు. అయితే.. ప‌ద‌వి అయితే..ఇచ్చారు కానీ.. ప్రాధాన్యం లేకుండా చేశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ వాద‌న ఎప్ప‌టి నుంచోఉన్నా కూడా ఇప్పుడు మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో బొత్స హ‌ర్ట్ అయ్యార‌ని.. ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉద్య‌మ పంథాను ఎంచుకున్నారు. సెప్టెంబ‌రు 1న సీఎం జ‌గ‌న్ ఇంటి ముట్డడికి పిలుపునిచ్చారు. దీంతో ఈ ఉద్య‌మాన్ని ఎలాగైనా.. ఆపివేయించాల‌ని..పార్టీ నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి ఆదిలో బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీంతో ఆయ‌న ఉత్సాహంగా ఉద్యోగులు.. ఉపాధ్యాయ సంఘాల‌నాయ‌కుల‌తో చ‌ర్చ‌కు దిగారు. అయితే.. పాన‌కంలో పుడ‌క‌లా.. స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌ను కూడా రంగంలోకి దింపారు.

దీనికి కూడా బొత్స పెద్ద‌గా బాధ‌ప‌డలేదు. అయితే.. తాను ఒక‌టి చెప్పి.. స‌ల‌హాదారు మ‌రో విధంగా చెప్ప‌డ‌మే ఇప్పుడు బొత్స‌కు పెద్ద ఇర‌కాటంగా మారిపోయింది. వాస్త‌వానికి కాంగ్రెస్ హ‌యాంలోనూ.. మంత్రిగా ఉన్న బొత్స‌.. ఇలాంటి ఉద్య‌మాల‌ను అనేకం చూశారు. అనేక మంది నాయ‌కుల‌ను ఏక‌తాటిపై న‌డిపించిన‌.. సీనియార్టీకూడా ఆయ‌న‌కు సొంతం. కానీ.. స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌.. 2019కి ముందు ఎంత మందికి తెలుసు? అంటే ప్ర‌శ్నార్థ‌క‌మే! అయినా.. కూడా ఆయ‌న త‌గుదున‌మ్మా అంటున్నారు.

దీంతో ఉద్యోగులకు బొత్స ఫోన్లు చేసి.. పిలిచి.. మాట్లాడి.. సీఎం ఇంటి ముట్ట‌డిని వాయిదా వేసుకోవాల‌ని చెబుతున్నా.. వారు వినిపించుకోవ‌డంలేదు. పైగా.. కొంద‌రు ఉద్యోగ సంఘాల నాయ‌కులు.. మంత్రి బొత్స‌తో మాట్లాడినా.. చివ‌ర‌కు తేల్చేది మాత్రం స‌ల‌హాదారుడేన‌ని బ‌హిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ప్ర‌భుత్వ వ్య‌తిరేక మీడియాలో పెద్ద ఎత్తున వ‌స్తోంది. ఈ ప‌రిణామాల‌తో.. మంత్రి బొత్స తీవ్రంగా ఆవేద‌న చెందుతున్నారు. ఇంత బ‌తుకు బ‌తికి.. ఏదో అయిన‌ట్టుగా మారిపోయింద‌ని.. త‌న అనుచ‌రుల వ‌ద్ద ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌.