వెకంటరెడ్డి కథ సుఖాంతమేనా?

మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలవటం మాటేమో కానీ ముందు భువనగిరి ఎంపీ, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్ద తలనొప్పిగా మారారు. ఈయన్ను దారిలోకి తెచ్చుకోవటం తెలంగాణా పార్టీ నేతల వల్ల కాలేదు. రోజుకో మాట, పూటకో ఆరోపణతో వెంకటరెడ్డి పార్టీలో గందరగోళం సృష్టిస్తున్నారు. ఒకసారేమో మునుగోడు ఉపఎన్నికకు దూరమంటారు. మరోసారేమో ప్రచార బాధ్యతలు తనకు అప్పగిస్తే ఉపఎన్నికలో పాల్గొంటానంటారు.

ఒకసారేమో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై నోటికొచ్చిన ఆరోపణలు చేస్తారు. మరోసారి తనను బూతులుతిట్టిన ఇద్దరు నేతలను పార్టీ నుండి బహిష్కరిస్తే కానీ ఉపఎన్నిలో పాల్గొనేది లేదంటారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడుతున్న వెంకటరెడ్డి వ్యవహారం తెలంగాణా పీసీసీకి పెద్ద తలనొప్పిగా తయారైంది. అందుకనే బుధవారం ఢిల్లీకి పిలిపించుకుని ప్రియాంక గాంధీ మాట్లాడారు.

ప్రియాంకతో భేటీలో ఏమి మాట్లాడుకున్నారో ఏమి హామీలు వచ్చాయో తెలీదు కానీ సమావేశం తర్వాత మాట్లాడిన వెంకటరెడ్డి మాత్రం పూర్తిగా మెత్తబడినట్లే అనిపిస్తున్నారు. ఉపఎన్నికలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్న ప్రియాంక మాటకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. సమస్యలు ఏమైనా ఉంటే ఉపఎన్నిక అయిపోయిన తర్వాత చూసుకుందామన్న ప్రియాంక మాటను తాను గౌరవిస్తున్నట్లు ఎంపీ చెప్పారు.

అయితే ఈ బుద్ధి ఎంతకాలముంటుందో ఎవరు చెప్పలేరు. ఎంపీ ప్రధాన సమస్య ఏమిటంటే కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి బీజేపీ అభ్యర్ధిగా దిగబోతున్న అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి స్వయాన తమ్ముడు కావటమే. పార్టీ గెలుపు కోసం తమ్ముడి ఓటమికి పనిచేయటమా ? లేదా తమ్ముడి గెలుపుకోసం పార్టీకి వెన్నుపోటు పొడవటమా ? అన్నదే ఎంపీని బాగా ఇబ్బంది పెడుతున్న అంశం.

ఒకవేళ తమ్ముడు గెలిస్తే పార్టీలో ఎంపీ పరువుపోవటం ఖాయం. వెంకటరెడ్డికి పార్టీలో ఇపుడున్న మర్యాద ఉండదు. తమ్ముడి గెలుపుకోసం పార్టీకే వెన్నుపోటు పొడిచారనే నిందను భరించక తప్పదు. ఇదే సమయంలో తమ్ముడు ఓడిపోతే కుటుంబంలో సమస్యలు మొదలవ్వటం ఖాయం. ఎందుకంటే వ్యాపారాలన్నింటినీ అన్నదమ్ములు కలిసే చేసుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.