జగన్ చేసిన పని పవన్ ఎందుకు చేయరు?

2019 ఎన్నికలలో సీఎం అభ్యర్థిగా, పార్టీ అధ్యక్షుడిగా ఎందుకైనా మంచిదని…ఒకటికి రెండు చోట్ల పోటీ చేశారు జనసేనాని పవన్. అయితే, ఏపీలో ఫ్యాన్ గాలి బలంగా వీయడంతో పవన్ ఫ్యాన్స్ గాలి జనసేన గెలుపునకు సరిపోలేదు. జనసేనకు ఘోర పరాభవవం తప్పదేమో అన్న తరుణంలో చీకట్లో చిరుదివ్వెలా జనసేన తరఫున ఒక ఎమ్మెల్యే గెలుపొందారు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి జనసేనకు జంప్ అయిన రాపాక వరప్రసాద్….అనూహ్య విజయం సాధించి జనసేన తరఫున తొలి అభ్యర్థిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది.

పవన్ ఓటమి…రాపాక గెలుపు….ఈ రెండు అంశాలే అనూహ్యమనుకుంటే…అసెంబ్లీలో రాపాక ప్రవర్తన అంతకు మించి అనూహ్యంగా ఉండడంతో పవన్ షాకయ్యారు. జనసేన తరఫున అసెంబ్లీలో కూర్చున్న రాపాక….వైసీపీకి వత్తాసు పలకడం…పవన్ కే కాదు…జనసేన నేతలు, కార్యకర్తలకూ మింగుడుపడలేదు. స్వపక్షంలో విపక్షంలా మారిన రాపాకపై అనర్హత వేటు వేయడానికి పవన్ కు నిమిషం పట్టదు…కానీ, పవన్ ఆ పని చేయడం లేదు.

దీంతో, జగన్ బాగా పని చేస్తున్నారు అని ప్రశంసలతో మొదలు పెట్టిన రాపాక….రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకే ఓటేశానని బహిరంగంగా ప్రకటించే స్థాయికి వెళ్లారు. ఓ పక్క కనీసం ఒక్క ఎమ్యెల్యే అయినా గెలిచారన్న ఆనందం జనసేన కార్యకర్తలు, నేతలకు ఎటూ లేదు. మరో పక్క కొరకరాని కొయ్యగా మారిన రాపాకను ఏమీ అనలేని పరిస్థితిలో పవన్ ఎందుకు ఉన్నారో అని అర్థం కాని పరిస్థితి. వైసిపి పై విపక్షాలు,జనసేన నేతలు విమర్శలు చేసిన ప్రతిసారీ…రాపాక…సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి సొంతపార్టీ పరువు బజారుకీడుస్తున్నారు.

అయినా…రాపాకపై పవన్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నది సగటు జనసేన కార్యకర్తని వేధించే మిలియన్ డాలర్ల ప్రశ్న.సాధారణంగా పార్టీపై, పార్టీ అధినేతపై విమర్శలు గుప్పిస్తే వెంటనే షోకాజ్ లు, క్రమశిక్షణా చర్యలు, సస్పెన్షన్ లు, అనర్హత వేటుకు పిటిషన్లు…వంటి చర్యలు సర్వసాధారణం. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారంలోనూ వైసీపీ ఎంపీలు …లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. రేపో మాపో ఆ వ్యవహారం తేలిపోనుంది. అయితే, అదే తరహాలో రాపాకపై పవన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.

పార్టీకి, పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా….పవన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు. ఇదే విషయాన్ని మీడియా ప్రశ్నిస్తే జవాబు చెప్పుకోలేని పరిస్థితిలో పవన్ ఎందుకున్నారు. రాపాకపై చర్యలు తీసుకుంటే …జనసేన నుంచి సస్పెండ్ చేస్తే….అపుడు రాపాక స్వతంత్ర ఎమ్యెల్యే అవుతారు. అపుడు, అసలు పార్టీ పేరే వినిపించకుండా పోతుందన్న భయం పవన్ కు ఉందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క ఎమ్మెల్యేకి ఫిరాయింపుల చట్టం చెల్లుబాటు కాదు…కానీ, పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చు. అయినా రాపాకను పవన్ భరించడం వెనుక ఉన్న కారణాలేంటో తెలియడం లేదు.మరోవైపు, వైసీపీ కూడా వేరే పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావాలని కోరుకోవడం లేదు.

జంప్ జిలానీలు వైసీపీలోకి రావాలంటే ఎన్నికల్లో పోటీ చేసి మరీ రావాలంటూ జగన్ గతంలో చెప్పారు. కాబట్టి, ఆయా పార్టీల్లో ఉంటూనే…వైసీపీకి అనుకూలంగా రాపాక, వల్లభనేని వంశీ తదితరులు వ్యవహరిస్తున్నారన్న టాక్ ఉంది. ఈ తరహా కొత్త ఒరవడికి తెరలేపింది టీడీపీనే. అదే పాలసీని వైసీపీ కంటిన్యూ చేస్తోంది. అయితే, వైసీపీకి కూడా రాపాక తరహాలో రఘురామకృష్ణం రాజు తలనొప్పిగా మారారు. కానీ, వైసీపీ చూసినన్నాళ్లు చూసి…షోకాజ్, అనర్హత వరకు వెళ్లింది. మరి, పవన్ అలా వెళ్లకపోవడానికి….కారణాలేమిటన్నది భేతాళ ప్రశ్నగానే మిగిలిపోతుంది. రఘురామకృష్ణం రాజు ( ఆర్ ఆర్ ఆర్ ) తరహాలో రాపాక వరప్రసాద్ (ఆర్ వీపీ) ఎపిసోడ్ కు క్లైమాక్స్ ఎప్పుడు?అన్న చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది.