దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ సఎం కేసీఆర్ గారాలపట్టి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు ఆధారాలతో సహాకొన్ని విషయాలను బయటకు తెచ్చారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. దీనిపై తాజాగా కవిత రియాక్ట్ అయ్యారు. తనదైన శైలిలో ఎదురు దాడి చేశారు. బీజేపీ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ క్రమంలో బీజేపీపై సంచలన కామెంట్స్ చేశారు.
‘‘ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్ కూతురును కాబట్టే నాపై ఇలా ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్‌ను మానసికంగా కృంగదీసేందుకే, బద్నాం చేసేందుకే బీజేపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాటికి భయపడేదే లేదు. బీజేపీ కక్ష పూరితంగానే నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్‌పై కొందరు తప్పుడు ప్రచారం చేశారు“ అని కవిత లైట్ తీసుకున్నారు.
అంతేకాదు.. ఇలాంటివి ఇంకెన్ని జరిగినా కేసీఆర్ వెనక్కి తగ్గరని కవిత చెప్పారు. ఆయన పోరాటం ఆపరని.. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారును గద్దె దింపే వరకు పోరాటం కొనసాగుతుందని కవిత వ్యాఖ్యానించారు. దేశ అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రతిక్షణం ఆలోచిస్తున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయాలని బీజేపీ చూస్తోందని నిప్పులు చెరిగారు. ప్రతి ఒక్క విషయాన్నీ.. తాముకూడా గమనిస్తున్నామని వ్యాఖ్యానించారు.
“మీరు అధికారంలో ఉన్నారని విచారణ సంస్థలు, మీడియాను అడ్డం పెట్టుకుని మమ్మల్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో నాకు ఎటువంటి సంబంధం లేదు’’ అంటూ కవిత.. వ్యాఖ్యానించారు. నిరాధార అరోపణలు చేస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయన్నారు.
కేసీఆర్‌ను మానసికంగా వేధించాలంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని కవిత చెప్పారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామని, ఎవరికీ భయపడేది లేదని ఆమె ధ్వజమెత్తారు. కేంద్రాన్ని విమర్శిస్తున్న కేసీఆర్‌ను తగ్గించడానికే బీజేపీ కుట్రం చేస్తోందని.. ఏ దర్యాప్తుకైనా తాము సిద్ధమేనని కవిత తేల్చి చెప్పారు.
ఇదిలావుంటే, ఢిల్లీ బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా వేయనున్నారు. ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాపై దావా వేయనున్నట్లు సమాచారం. డిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకే దావా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆమె న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు.