జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తన సొంత పార్టీ నేతలపై ఫైరయ్యారు. పార్టీలో ఉంటూ.. కోవర్టులుగా పనిచేస్తున్నారని.. ఆయన నిప్పులు చెరిగారు. అంతేకాదు.. ఇలాంటి వారి వల్ల శతృవు ఎవరో.. మిత్రుడు ఎవరో కూడా తాను పసిగట్టలేక పోతున్నానని చెప్పారు. ఇలాంటి వారు తనచుట్టూ తిరగడం కన్నా.. వారికి నచ్చిన పార్టీలో చేరొచ్చని.. ఆయన అన్నారు. తనకు కోవర్టుల గురించిన సమాచారం ఉందన్న ఆయన.. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. త్వరలోనే వారు మారాలని.. లేకపోతే.. తాను మారుస్తానని చెప్పారు.
గతంలో పార్టీలో అనేక తప్పులు జరిగాయని పవన్ అన్నారు. వాటివల్లే పార్టీ అనేక రూపాల్లో నష్టపోయిందని చెప్పారు. అయితే.. ఇప్పుడు అలాంటి తప్పులు జరగనివ్వనని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. కేవలం కొందరు నాయకులు.. సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేందుకు మాత్రమే పరిమితం అవుతున్నారని.. ఇలాంటి వారు మారాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరికొందరు అడపా దడపా.. తాను వస్తుంటే.. తన వెంట వచ్చి.. హంగామా చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.
ఇలాంటి పరిణామాలను ఉపేక్షించేది లేదన్నారు. జనసేన వ్యూహాలు.. వచ్చే ఎన్నికల్లో అనుసరించే మార్గాలను ప్రతి ఒక్క కార్యక ర్త, నాయకుడు కూడా తెలుసుకోవాలని.. పవన్ కోరారు. “మన ఆలోచనలను, ఉద్దేశాలను ప్రజలకు చేరవేయండి. ఎప్పుడూ.. నేనే వచ్చి సమావేశాలు పెట్టాలంటే.. కుదరదు. మీరు కూడా ప్రజల్లో ఉండండి. వారి సమస్యలు తెలుసుకోండి. వారికి అండగా ఉండండి. పార్టీని బలోపేతం చేయండి.“ అని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహాలు వేయడంలో దిట్టగా పవన్ పేర్కొన్నారు. ఆయనను అనుసరించాలని తాను కోరుకుంటానని.. ఆ విధంగానే వచ్చే ఎన్నికల్లో ఏపీలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తామని పవన్ చెప్పారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యకర్తలతో భేటీ అయి.. చర్చించారు.