Jr NTR – అమిత్ షా భేటీ.. కొడాలి నాని కామెంట్

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు.. అమిత్ షా.. నోవాటెల్ హోటల్‌లో జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయిన విష‌యం తెలిసిందే. ఈ భేటీపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ మాత్రం ఇది.. కేవలం అభినంద‌న మీటేన‌ని అంటుంటే.. విశ్లేష‌కులు స‌హా ప‌లువురు రాజ‌కీయ నేత‌లు మాత్రం హైద‌రాబాద్ లోని సెటిల‌ర్ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు బీజేపీ ఆడుతున్న పొలిటిక‌ల్ గేమ్‌గా చెబుతున్నారు.

అయితే.. దీనిపై తాజాగా ఏపీ మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు.. కొడాలి నాని స్పందించారు. త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు. బీజేపీ పెద్ద‌లుగా ఉన్న‌ మోడీ, అమిత్ షా ఉపయోగం లేకుంటే నిమిషం కూడా ఎవరితో మాట్లాడరని అన్నారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీని విస్తరించేందుకు వారిద్ద‌రు కూడా కంక‌ణం క‌ట్టుకున్నార‌ని అన్నారు. ఈ క్ర‌మంలో వారికి అవ‌స‌ర‌మైతే.. ఎవ‌రితో అయినా.. మాట్లాడ‌తార‌ని చెప్పారు.

ఈ నేప‌థ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా సమావేశం అయ్యారని భావిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలపరచుకోవడానికే కేంద్రమంత్రి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పాన్ ఇండియా స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం చేయించే అవకాశం ఉందని అన్నారు. చంద్రబాబుతో ప్రయోజనం లేకే ఢిల్లీ వచ్చినా మోడీ, అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని కొడాలి నాని విమ‌ర్శించారు.

అయితే.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను కేవ‌లం ఒక రాష్ట్రానికి ప‌రిమితం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఆయ‌న పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న హీరో కాబ‌ట్టి.. దేశ‌వ్యాప్తంగా కూడా బీజేపీ ఆయ‌న సేవ‌లు వినియోగిం చుకునే అవ‌కాశం లేక పోలేద‌ని కొడాలి వ్యాఖ్యానించారు. బీజేపీ వెళ్లి జూనియ‌ర్‌తో క‌లిసినా.. ఇంకెవ‌రితో క‌లిసినా.. వైసీపీకి వ‌చ్చే న‌ష్టం ఏమీ లేద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లకు జ‌గ‌న్ చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు.. సామాజిక న్యాయం వంటివి ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ ఎక్క‌డా చేయ‌లేద‌ని.. కాబ‌ట్టి.. త‌మ‌కు ఎలాంటి భ‌యం లేద‌ని ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు.