సంచలన ఆరోపణ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రతి విషయానికి అవసరానికి మించి స్పందించే ఆయన తీరుతో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి ఆయనలో అభద్రతా భావం అంతకంతకూ పెరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. ఇందుకు తగ్గట్లే.. అవసరం లేకున్నా అదే పనిగా మాట్లాడే ధోరణి ఎక్కువ అవుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద విమర్శలు.. ఆరోపణలు చేసేటప్పడు తగిన ఆధారాలతో ప్రజల ముందుకు రావటం బాగుంటుంది.
అందుకు భిన్నంగా ఎల్లయ్యో.. పుల్లయ్యో చెప్పే మాటల్ని పట్టుకొని అదే పనిగా ప్రెస్ మీట్ లు పెట్టేసి ఆరోపణలు చేస్తే.. లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. అధినేత అన్న వ్యక్తి ఆచితూచి అన్నట్లు మాట్లాడాలి. దాదాపు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నేత నోటి నుంచి ఏదైనా విమర్శ.. ఆరోపణ వస్తుందంటే అందరూ అలెర్టు అయ్యేలా ఉండాలి. అంతేకానీ.. కామెడీ చేసుకునేలా ఉండకూడదు.
తాజాగా ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోసే క్రమంలో సంచలన ఆరోపణ ఒకటి జగన్ సర్కారు మీద సంధించారు చంద్రబాబు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సామాజిక న్యాయాన్ని తుంగులోకి తొక్కారని.. రాష్ట్రాన్ని మూడుముక్కలు చేశారంటూ మండిపడ్డారు. ఏపీ డీజీపీ ఆఫీసులో ఒక వ్యక్తిని పెట్టి మరీ.. రోజూ ఎవరెవరిపైన కేసులు పెట్టాలన్న డైరెక్షన్ ఇప్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. తాము సైతం అదే తీరులో చేసి ఉంటే.. ఇవాల్టి రోజున జగన్ పరివారం సోదిలో ఉండేదా? అని ప్రశ్నించారు.
జగన్ సర్కారు తమనెంత వేధించినా పోరాడతామని చెప్పిన చంద్రబాబు.. రాష్ట్ర డీజీపీ ఆఫీసులో ఉండే వ్యక్తి ఎవరన్న విషయాన్ని ఆధారాలతో సహా రివీల్ చేసి ఉంటే బాగుండేది. దీనికి సంబంధించిన వీడియోలు ఏవైనా ఉంటే మరింత బాగుండేది. అందుకు భిన్నంగా అదే పనిగా మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయం బాబుకు ఎప్పటికి అర్థమవుతుందో?