ఇటు టీఆర్ఎస్‌.. అటు బీజేపీ

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక తేదీ ఇంకా ఖ‌రారు కాలేదు. ఇంకా షెడ్యూలే విడుద‌ల అవ‌లేదు. అస‌లు ఎప్పుడు జ‌రుగుతుందో కూడా తెలియ‌దు. కానీ, ఇక్క‌డ రాజ‌కీయం మాత్రం.. భోగి మంట‌ల‌ను త‌ల‌పిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికి వారుగా.. బీజేపీ, టీఆర్ ఎస్ నాయ‌కులు రాజ‌కీయ దుమారానికి తెర‌దీసిన విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా ఆదివారంమాత్రం.. ఒకేరోజు.. ఈ రెండు పార్టీల అగ్ర‌నాయ‌కులు.. ఇక్క‌డ స‌భ‌లు నిర్వ‌హిస్తుం‌డంతో  మునుగోడు రాజ‌కీయాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయ‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఉద‌యం కేసీఆర్‌..

మునుగోడులో గెలుపు గుర్రం ఎక్కి.. త‌మ‌కు తిరుగులేద‌నే సంకేతాలు పంపించాల‌ని భావిస్తున్న సీఎం కేసీఆర్‌.. అప్పుడే రంగంలోకి దిగిపోయారు. ఆదివారం.. బీజేపీ అగ్ర‌నేత కేంద్ర మంత్రి అమిత్ షా ప‌ర్య‌ట‌న‌, స‌భ ఉన్న నేప‌థ్యంలో కేసీఆర్ అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం బీజేపీ స‌భ ఉన్న ద‌రిమిలా.. దానికిముందుగానే.. ఆయ‌న ఇక్క‌డ భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌నున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు మండలాల నుంచి భారీ ఎత్తున జనసమీకరణతో సభ నిర్వహించాలని పార్టీ ముఖ్యులు నిర్ణయించారు.

సీఎం సభకు తమను ఆహ్వానించలేదని కొంత మంది నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు నిఘా వర్గాలతో పాటూ పలు మార్గాల ద్వారా టీఆర్ ఎస్‌ అధిష్ఠానం తెలుసుకుంటూ మార్గదర్శనం చేస్తుండటంతో   నేతలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే, సీఎం సభ అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్య నేతలతో హైదరాబాద్‌లో కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు స‌మాచారం. అయితే.. బీజేపీ క‌న్నా.. కేసీఆర్ ముందుగానే స‌భ‌ను నిర్వ‌హించ‌డం ప‌ట్ల‌.. రాజ‌కీయంగా చ‌ర్చ సాగుతోంది.

సాయంత్రం అమిత్‌షా..

మునుగోడు ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బీజేపీ.. ఇక్క‌డ పాగా వేయ‌డం ద్వారా.. కేసీఆర్ దూకుడుకు అడ్డుక‌ట్ట వేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలో బీజేపీ అగ్ర‌నేత‌.. అమిత్‌షా రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం ఆయ‌న మునుగో డుకు రానున్నారు. ఇక్క‌డ సాయంత్రం నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు. కేసీఆర్ స‌భ‌ను మించి అమిత్ షా పాల్గొనే స‌భ‌ను విజ‌యవంతం చేయాల‌ని బీజేపీ ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది.  ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలంతా క్షేత్రస్థాయిలో దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.