మారుతున్న రాజ‌కీయాలు.. కేసీఆర్‌కు క‌ష్ట‌మే?

కేంద్రంలో చ‌క్రం తిప్ప‌డం ఖాయ‌మ‌ని భావించిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు క‌ష్టాలు ప్రారంభ మయ్యాయా?  ఆయ‌న అనుకున్న‌ట్టుగా కేంద్రంలో చ‌క్రం తిప్ప‌డం అంత ఈజీకాదా?  ఆయ‌న‌ను రాష్ట్రానికే ప‌రిమితం చేసేలా.. స‌హ‌క‌రించే వారిని కూడా దూరం చేసేలా.. కేంద్రంలోని బీజేపీ పావులు క‌దుపుతోందా? అంటే.. తాజాగా మారుతున్న ప‌రిణామ‌ల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఢిల్లీ టూ హైద‌రాబాద్‌.. అంటూ.. త‌ర‌చుగా చ‌క్క‌ర్లు కొట్టిన కేసీఆర్‌.. ఇప్పుడు రాష్ట్రం వ‌దిలి వెళ్ల‌లేని ప‌రిస్థితిని బీజేపీ క‌ల్పించింది.

రాష్ట్రంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో .. ఎలాంటి రాజ‌కీయ ప‌రిణామాలు ఎదుర‌వుతాయో.. అనే బెంగ కేసీఆర్‌కు ప‌ట్టుకుంద‌ని.. విశ్లేష‌కులు చెబుతున్నారు. పార్టీ నుంచి జంపిగుల‌ను ప్రోత్స‌హిస్తుండ‌డం.. నాయ‌కులు కూడా త‌మ‌కు టికెట్ ఇస్తారో లేదో.. ప్ర‌జ‌ల్లో కేసీఆర్ ఇమేజ్ ఏమైనా త‌గ్గిపోయిందా? అనే చింతలో ఉన్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న కేసీఆర్‌.. పైకి అంతా బాగానే ఉంద‌ని చెబుతున్నా.. లోలోన మాత్రం అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు. తాను ఇప్పుడు రాష్ట్రంలో మూడో సారి అధికారంలోకి రాక‌పోతే.. అటు కేంద్రంలో చ‌క్రం తిప్ప‌డం క‌ష్ట‌మేన‌ని ఆయ‌న భావిస్తున్నారు.

దీంతో ఆయ‌న ఇప్పుడు మెజారిటీ స‌మ‌యాన్ని రాష్ట్రంలోని రాజ‌కీయాల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకే కేటాయిస్తున్నారు. మ‌రోవైపు.. కేంద్రంలోనూ.. రాజ‌కీయాలు మారుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌న‌కు అండ‌గా నిలుస్తార‌ని అనుకున్న బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని మోడీ త‌న‌వైపు తిప్పుకొన్నారు. మోడీ అప్ర‌క‌టిత‌ దూత‌గా బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి.. దీదీని క‌లుసుకోవ‌డం.. ఆమెపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించ‌డం వంటివి చూస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. బీజేపీకి మ‌మ‌త మ‌ద్దతు ప్ర‌క‌టించినా ఆశ్చ‌ర్యం లేదనే స‌రికొత్త వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది.

అంతేకాదు.. బీజేపీయేత‌ర రాష్ట్రాల్లోనూ.. ఇప్పుడు.. ఈడీ భ‌యం కావొచ్చు.. మోడీ వ్యూహాల‌కు కావొచ్చు.. ఆయా రాష్ట్రాల్లోనూ ప్ర‌భుత్వాలు.. త‌మ పార్టీల‌ను నిల‌బెట్టుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇక‌, కాంగ్రెస్‌లోనూ దూకుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. భార‌త్ జోడో కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌ని రాహుల్ అనుకున్నా.. ఈ కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న కుదించుకున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కేంద్రంలో చక్రం తిప్ప‌డం.. కేసీఆర్‌కు అంత ఈజీకాద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. మ‌రి ఆయ‌న ఎలా ముందుకు సాగుతారో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.