టీఆర్ఎస్ ది బలప్రదర్శనేనా?

మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో అన్ని పార్టీలు గెలుపును దృష్టిలో పెట్టుకుని అనేక వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగానే బలప్రదర్శనకూ దిగుతున్నాయి. ఈనెల 20వ తేదీన నియోజకవర్గం కేంద్రం మునుగోడులో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు కనీవినీ ఎరుగనంత స్ధాయిలో జనసమీకరణ చేయాలని ఇప్పటికే కేసీయార్ ఆదేశించారు. 25 ఎకరాల్లో జరగబోయే బహిరంగ సభకు లక్షలాది మందిని తీసుకురావాలని టార్గెట్ గా చాలామంది నేతలు పనిచేస్తున్నారు.

కచ్చితంగా టీఆర్ఎస్ ది బలప్రదర్శననే చెప్పాలి. ఎందుకంటే టీఆర్ఎస్ బహిరంగసభ జరిగిన మరుసటి రోజు అంటే 21వ తేదీన నియోజకవర్గంలోని చౌటుప్పల్ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో బహిరంగసభ జరగబోతోంది. ఈ సభ నిర్వహణ  కాంగ్రెస్ మాజీ ఎంఎల్ఏ, బీజేపీలో చేరి మళ్ళీ ఉపఎన్నికలో పోటీ చేయబోతున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి వ్యక్తిగతంగా సవాల్ లాంటిది. తన ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా తన సత్తా ఏమిటో చాటాలని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు.

రాజగోపాల్ ఎందుకింత పట్టుదలగా ఉన్నారంటే ఆ బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతున్నారు. అమిత్ షా సమక్షంలోనే రాజగోపాల్ పార్టీలో చేరబోతున్నారు కాబట్టే. తానెంతటి శక్తిమంతుడో షాకి చాటి చెప్పేందుకే మాజీ ఎంఎల్ఏ చాలా కష్టపడుతున్నారు. నిజానికి మునుగోడులో రాజగోపాల్ బలమే బీజేపీ బలమని అందరికీ తెలుసు. ఇక్కడ పార్టీకంటు వున్న బలం చాలా నామమాత్రమే. రేపు రాజగోపాల్ గెలిచినా అది పూర్తిగా వ్యక్తిగత విజయమే కానీ పార్టీ వల్ల గెలవటం కాదు.

హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ ఎలా గెలిచారో మునుగోడులో రాజగోపాల్ కూడా అలాగే గెలవాలి. ఇందుకే బహిరంగ సభ నిర్వహణ, ఎన్నికల ప్రక్రియ మొత్తం రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలోనే జరుగుతోంది. టీఆర్ఎస్ బహిరంగసభ జరిగిన మరుసటి రోజే బీజేపీ సభ జరుగుతోంది కాబట్టి కచ్చితంగా హాజరైన జనాల విషయంలో పోలికుంటుంది. ఇక కాంగ్రెస్ కూడా బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ సభ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో చూడాలి.