ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్‌కు సంబందించిన భారీ కుంభకోణాన్ని త్వరలోనే తాను బయట పెట్టనున్నట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. జగన్‌వి పదో తరగతి పాస్.. డిగ్రీ ఫెయిల్ తెలివి తేటలని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల కంటే వెళ్లిపోయినవే ఎక్కువని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పేదల కోసం సొంత ఖర్చుతో ఆరోగ్య సంజీవిని పేరిట ఏర్పాటు చేసిన వైద్య సేవల కేంద్రాన్ని లోకేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ‘అందరికీ ఆరోగ్యమస్తు – ఇంటికి శుభమస్తు’ నినాదంతో సొంత ఖర్చుతో మంగళగిరిలో ఉచిత వైద్య కేంద్రాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఈ వైద్య కేంద్రం ద్వారా ఆరోగ్య సంజీవని పేరుతో నియోజకవర్గంలోని పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్టు చెప్పారు. దీనికి అవసరమైన వైద్యులు, సిబ్బంది, చికిత్స పరికరాలను లోకేశ్ సమకూర్చారు. ఇక్కడ దాదాపు 200కు పైగా రోగనిర్ధరణ పరీక్షలు ఉచితంగా చేయనున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఫైరయ్యారు. ఆయనవి పదో తరగతి పాస్.. డిగ్రీ ఫెయిల్ తెలివితేటలని లోకేష్ ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన వాటి కంటే బయటకు వెళ్లిన పరిశ్రమలే ఎక్కువని ధ్వజమెత్తారు. పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా సీఎంకు వాటా ఎంత అనే చర్చ వస్తుందని మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేస్తే.. చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
ఈడీ, ఐటీ, సీబీఐకి భయపడి సీఎం జగన్ ఢిల్లీ పెద్దల ముందు తలవంచారని దుయ్యబట్టారు. సీఎం జగన్‌కు సంబంధించిన పెద్ద కుంభకోణం వచ్చేవారం బయటపెడతానని వెల్లడించారు. మరోవైపు విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ నేతలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు నారా లోకేష్ మద్దతు తెలిపారు. సీఎం జగన్ దళిత ద్రోహిగా మారారని మండిపడ్డారు. విదేశీవిద్య పథకానికి అంబేడ్కర్ పేరు పెట్టేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.