ప్రధాని మోడీనే తెలంగాణకు ప్రధాన శత్రువని ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన ప్రధాని మోడీ కేంద్రంగా నిప్పులు చెరిగారు. కేంద్రం అసమర్థత కారణంగానే తెలంగాణకు నీరు అందడం లేదని వ్యాఖ్యానించారు. వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలలోని పొలాలకు కృష్ణా నీరు అందేలా చూసే బాధ్యత తనదన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రధాని నెరవేర్చలేదని మండిపడ్డారు. దుర్మార్గమైన పాలకులను పారద్రోలి తెలంగాణను కాపాడానన్నారు.
రాజకీయంగా చైతన్యం లేని సమాజం దోపిడీకి గురవుతుందని కేసీఆర్ చెప్పారు. మోసపోతే.. గోసపడతామని.. గత ప్రభుత్వాల హయాంలో అవస్థలు పడ్డామన్నారు. మళ్లీ ఆ బాధలు తెలంగాణలో రావద్దంటే రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ సంక్షేమం కోసం.. దేశ ప్రధానినే ప్రశ్నించానని కేసీఆర్ తెలిపారు.
‘‘నిత్యావసరాలు, ఇంధన వనరుల ధరల పెంపుతో ప్రజలపై భారం మోపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలంటూ ముందుకు వస్తున్నారు. ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్రాన్ని నమ్మాల్సిన అవసరం ఉందా?. బీజేపీ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధిని ఒకసారి పరిశీలించండి. ఎనిమిదేళ్ల పాలనలో ప్రధాని మోడీ చేసిందేమిటి?. మన సంక్షేమ పథకాలను ఉచితాల పేరుతో కేంద్రం అవమానిస్తోంది.’’ అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనికి ముందు వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఎన్నేపల్లి వద్ద 36 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 61 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ కలెక్టరేట్ భవనాన్ని సకల సౌకర్యాలతో ప్రభుత్వం నిర్మించింది. మొత్తం 42 విభాగాలు ఇక్కడ నుంచి పని చేయనున్నాయి. అంతకుముందు వికారాబాద్ టీఆర్ ఎస్ కార్యాలయాన్ని కూడా సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates