ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణానికి డేట్ ఫిక్స్?

ఇటీవల రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్.. మోపిదేవి వెంకటరమణలు ఇద్దరూ తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ రెండు ఖాళీల్ని ఎప్పుడు భర్తీ చేస్తారు? ఎవరికి కొత్త మంత్రులుగా అవకాశం లభిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏడాది పాలనతో దూసుకెళుతున్న జగన్ సర్కారు.. మహమ్మారి లాంటి విపత్తు వేళలోనూ.. తనదైన శైలిలో పాలనపై ముద్ర వేస్తున్నారు.

మహమ్మారికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోజగన్ ప్రభుత్వం అనుసరించిన విధానంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేసుల వ్యాప్తిని నిరోధించటంలో ఏపీ సర్కారు తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంత్రి పదవుల్ని దక్కించుకోవటం కోసం పోటీ పెరుగుతోంది. రాజీనామా చేసిన ఇద్దరు మంత్రులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో.. అదే వర్గానికి చెందిన నేతలకే పదవులు లభిస్తాయన్న ప్రచారం సాగుతోంది.

ఇందులో భాగంగా ఇప్పటివరకూ పలు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిందరి పేర్లు పెద్ద ఆశ్చర్యానికి గురి చేయకున్నా.. సీనియర్ నేత.. కాపు సామాజిక వర్గానికి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేరు తెర మీదకు రావటం అనూహ్యంగా చెబుతున్నారు. బీసీ కోటాలోకి కాపు సామాజిక వర్గాన్ని తాను పరిగణలోకి తీసుకుంటున్న సందేశాన్ని ఉమ్మారెడ్డి నియామకంతో జగన్ స్పష్టం చేసే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే వీలుంది.

ఇదిలా ఉంటే.. కొత్త మంత్రుల చేత పదవీ ప్రమాణస్వీకారం చేయించటానికి ముహుర్తాన్ని ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆషాడ మాసం నడుస్తున్న వేళ.. శ్రావణమాసంలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 20తో ఆషాడం ముగుస్తుందని.. 21 శ్రావణం ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి.. ఈసారికి మంత్రి పదవులు ఎవరికి దక్కనున్నాయి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.