మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని తేలిగ్గా కూల్చేసి ముఖ్యమంత్రయిన ఏక్ నాథ్ షిండే ఇపుడు ఉక్కిరిబిక్కిరై పోతున్నారు. మంత్రివర్గ కూర్పులో షిండే పూర్తిగా ఫెయిలయ్యారు. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకుంటే ఏమవుతుందో అర్థం కాక నానా అవస్థలు పడుతున్నారు. దీని ఫలితంగానే జూన్ 30వ తేదీన ముఖ్యమంత్రి షిండే, ఉపముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేసినా ఇప్పటివరకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేకపోయారు.
మంత్రివర్గం ఏర్పాటు చేయలేకపోవడమే షిండే చేతకానితనంగా బయటపడుతోంది. మంత్రివర్గాన్ని షిండే ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు ? ఎందుకంటే తన వర్గంలోని 40 మంది ఎంఎల్ఏలకు షిండే మంత్రి పదవులను ఎరగా వేశారు. థాక్రేని ముఖ్యమంత్రిగా దింపేయటం, సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేయటమే టార్గెట్ గా పావులు కదిపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తనకంటూ వర్గాన్ని ఏర్పాటుచేసుకోవటానికి అప్పట్లో షిండే అందరికీ మంత్రిపదవులను హామీ ఇచ్చారట.
మంత్రి పదవులకు ఆశపడిన ఎంఎల్ఏలు షిండే వైపు చేరారు. అయితే తిరుగుబాటు సమయంలో షిండేతో బీజేపీ చేతులు కలపటంతోనే థాక్రేని పడగొట్టడం సాధ్యమైంది. తర్వాత రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అంటే షిండే నాయకత్వంలోని ప్రభుత్వంలో బీజేపీకి కూడా భాగస్వామ్యం ఇవ్వాల్సొచ్చింది. దీంతో 283 ఎంఎల్ఏలున్న అసెంబ్లీలో మంత్రులుగా సుమారు 44 మందిని తీసుకోవచ్చు. ఈ దామాషా ప్రకారం 106 మంది ఎంఎల్ఏలున్న బీజేపీకి 70 శాతం, 40 మంది ఎంఎల్ఏలున్న షిండేవర్గానికి 30 శాతం మంత్రిపదవులు మాత్రమే దక్కాయి. దాంతో తనవర్గంలోని 40 మంది ఎంఎల్ఏల్లో షిండే మహాఅయితే 15 మందికన్నా అవకాశం కల్పించేందుకు లేదు.
దీంతో మిగిలిన ఎంఎల్ఏల నుండి షిండేపై మంత్రిపదవుల విషయంలో ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. ఈకారణంగానే నెలరోజులకు పైగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నారు. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకుంటే మిగిలిన ఎంఎల్ఏలు ఏమిచేస్తారో అనే భయంతోనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నారట. ఆగష్టు 15వ తేదీలోగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుంది. మరి మంత్రి వర్గాన్ని ఏర్పాటుచేసిన తర్వాత షిండేకి అసలు సమస్యలు మొదలు కానున్నాయి.