కచ్చితంగా కలిసొస్తుందనే గ్యారెంటీ అయితే లేదు. ఒక్కోసారి వ్యూహం ఎదురుతన్నే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇపుడు కాంగ్రెస్ మునుగోడు ఎంఎల్ఏగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. స్పీకర్ రాజీనామాను ఆమోదిస్తే బంతి కేంద్ర ఎన్నికల కమీషన్ పరిధిలోకి వెళుతుంది. బహుశా వచ్చే డిసెంబర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు జరిగే సాధారణ ఎన్నికలతో కలిపి మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక జరిగే అవకాశముందని అనుకుంటున్నారు.
ఆ ఉపఎన్నికలో బీజేపీ తరపున మళ్ళీ రాజగోపాలరెడ్డే పోటీ చేస్తారనటంలో సందేహంలేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే రాజగోపాల్ కాంగ్రెస్ కు రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు. తన రాజీనామాకు ఎంఎల్ఏ చెప్పిన కారణాలన్నీ ఉత్త కథలే అని అందరికీ అర్థమైపోయింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత కోపంతో మాత్రమే రాజగోపాల్ కాంగ్రెస్ కు, ఎంఎల్ఏగా రాజీనామా చేసినట్లు అర్ధమైపోయింది. వ్యక్తిగత అజెండాతో రాజీనామా చేసి ఉపఎన్నికను జనాలు స్వాగతిస్తారా ?
ఇక్కడే సందేహాలు మొదలయ్యాయి. ఎందుకంటే 2004 జనరల్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున టికెట్ రానికారణంగా వైఎస్సార్ కు అత్యంత సన్నిహితుడైన దానం నాగేందర్ హిమాయత్ నగర్ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీచేశారు. అయితే వైఎస్సార్ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాంతో నాగేందర్ టీడీపీలో ఉండలేక వైఎస్సార్ తో మాట్లాడుకుని రాజీనామా చేసేశారు. దాంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆ ఉపఎన్నికలో దానం గెలుపు నల్లేరుమీద బండినడకే అనుకున్నారు.
అయితే ఆశ్చర్యంగా దానం ఓడిపోయారు. ఎలాంటి కారణంలేకుండానే ఎంఎల్ఏగా రాజీనామాచేసి ఉపఎన్నికలో మళ్ళీ తానేపోటీచేస్తే జనాలు సానుకూలంగా స్పందిచరన్న విషయం అర్ధమైపోయింది. కాబట్టి రేపటి ఎన్నికల్లో రాజగోపాల్ గెలుస్తారనే గ్యారెంటీ ఏమీలేదు. బీజేపీ-కాంగ్రెస్ గొడవల్లో మధ్యలో టీఆర్ఎస్ గెలిచినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అదే జరిగితే అప్పుడు రాజగోపాల్ పరిస్ధితి ఎలాగుంటుందో.